NationalNews

24నే దీపావళి సెలవు

హైదరాబాద్‌, మనసర్కార్‌: దీపావళి పండుగ 25 నుంచి 24వ తేదీకి మారింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 25వ తేదీన అమావాస్య ఉంది. దీపావళి పండుగను సాధారణంగా అశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. దీంతో 25వ తేదీన దీపావళి అని క్యాలెండర్లలో ఉంది. కానీ.. ఆరోజు అమావాస్య సాయంత్రం ఉండకపోవడంతో పండుగను 24వ తేదీనే జరుపుకోవాలని పండితులు  సూచించారు. దీపావళిని ప్రదోష వేళ అంటే.. సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉంది. అయితే.. ప్రదోషవేళ (సూర్యాస్తమయం) సమయానికి పౌడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చింది. అంటే.. సూర్యాస్తమయానికి అమావాస్య పూర్తవుతుంది.

అమావాస్య 24వ తేదీన సోమవారం సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం సూర్యాస్తమయానికి అమావాస్య ఘడియలే ఉన్నందున దీపావళి పండుగను ఆ రోజే జరుపుకోవాలని పండితులు వివరించారు. ధనలక్ష్మి పూజలు కూడా అదే రోజు నిర్వహించాలన్నారు. సాధారణంగా దీపావళి రోజు మధ్యాహ్నం వేళ అమావాస్య సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుకుంటారు. 24వ తేదీన మధ్యాహ్నం అమావాస్య ఘడియ లేకపోవడంతో కేదారేశ్వర వ్రతాన్ని మంగళవారం 25వ తేదీన జరుపుకోవాలని కొందరు పండితులు అన్నారు. మరికొందరు మాత్రం 24వ తేదీనే జరుపుకోవాలన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.