చమురు సంస్థలకు 22 వేల కోట్ల సాయం
చమురు కంపెనీల నష్టాలను తగ్గించేందుకు చర్యలు
22 వేల కోట్ల గ్రాంట్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రెండేళ్లలో మూడొందల శాతం పెరిగిన గ్యాస్ ధరలు
వినియోగదారులకు 70 శాతం మేర అదనపు భారం
నష్టాలను పూడ్చుకోవడానికి చమురు సంస్థలకు ప్రభుత్వం ₹ 22,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. గత రెండేళ్లలో దేశీయ వంట గ్యాస్ ఎల్‌పిజిని తక్కువ ధరకు విక్రయించడం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు మూడు ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలకు 22,000 కోట్లను ఒకేసారి మంజూరు చేస్తున్నట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలకు – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లకు వన్-టైమ్ గ్రాంట్‌ను ఆమోదించింది. జూన్ 2020 నుండి జూన్ 2022 వరకు వినియోగదారులకు తక్కువ ధరకు LPGని విక్రయించడం ద్వారా పొందిన నష్టాలను పూడ్చడం కోసం ఈ గ్రాంట్ ఉపకరిస్తుంది.

కేంద్ర నుంచి సాయం లభించడంతో మూడు సంస్థలు LPGని వినియోగదారులకు ప్రభుత్వ చెప్పే విధంగా నియంత్రిత ధరలకు విక్రయిస్తాయి. జూన్ 2020 నుండి జూన్ 2022 మధ్య, LPG అంతర్జాతీయ ధరలు దాదాపు 300 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా పెరిగినట్టుగా ధరలను వినియోగదారులపై మోపకపోవడంతో చమురు కంపెనీలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దేశీయంగా ఎల్‌పిజి ధరలు కేవలం 72 శాతం మాత్రమే పెరిగాయని, ఇది మూడు సంస్థలకు గణనీయమైన నష్టాలకు దారితీసిందని ప్రభుత్వం చెబుతోంది. నష్టాలు పెరుగుతున్నప్పటికీ.. సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా చమురు సంస్థలు పనిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా… దేశ ప్రజలకు ఆటంకం లేకుండా LPG సరఫరాలను కొనసాగేలా చేస్తున్నామని కేంద్రం అభిప్రాయపడింది.


 
							 
							