InternationalNationalNews

బైడెన్ ప్రభుత్వంలో 130 మంది భారతీయ అమెరికన్లు

 అమెరికాలో దూసుకుపోతున్న భారతీయులు
 ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ కీలక బాధ్యతలు
 బైడెన్ హయాంలో 130 మందికి పదవులు
 అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో నలుగురు
 అమెరికా జనాభాలో భారతీయలు ఒక్కశాతమే
 పదవుల్లో మాత్రం భళా అన్నట్టుగా తీరు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వంలో ఇప్పటివరకు 130 కంటే ఎక్కువ మంది భారతీయ-అమెరికన్‌లకు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికన్ జనాభాలో ఒక శాతం మాత్రమే ఉన్న పాపులేషన్‌కు అత్యంత గుర్తింపు ఇది. 2020లో అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఇచ్చిన హామీలను బైడెన్ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నాడు. డెమొక్రట్ల అధ్యక్ష అభ్యర్థిగా గెలిచేందుకు భారతీయులు అంతకు ముందు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ 80 మందికి పైగా భారతీయ-అమెరికన్‌లను నియమించాడు. ఆయనకంటే ముందుగా దాదాపు ఎనిమిదేళ్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్ ఒబామా కేవలం 60 మందిని మాత్రమే భారతీయ-అమెరికన్లకు అవకాశాలు కల్పించారు. ప్రస్తుతం అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో నలుగురు సభ్యులతో సహా వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు వివిధ హోదాల్లో ఉన్నారు. 20 కంటే ఎక్కువ మంది భారతీయ-అమెరికన్‌లు అమెరికా అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు.

రోనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా భారతీయ అమెరికన్లకు అవకాశాలు కల్పించారు. కానీ బైడెన్ తన పరిపాలనలోని దాదాపు అన్ని విభాగాలు, ఏజెన్సీల్లో భారతీయ-అమెరికన్‌లను అవకాశం ఉన్నచోటల్లా నియమిస్తూపోతున్నారు. ఇండియన్-అమెరికన్లు సేవా భావనతో ఉంటారని… అందుకే ఎక్కువ మంది ప్రజా సేవ చేసేందుకు ఉత్సాహం చూపుతారని… అందుకే చాలా మంది ప్రైవేట్ రంగానికి బదులుగా పబ్లిక్ సర్వీసులో కొనసాగేందుకు ఇష్టపడతారని… సిలికాన్ వ్యాలీ వ్యాపార దిగ్గజం, వెంచర్ క్యాపిటలిస్ట్ ఎంఆర్ రంగస్వామి పేర్కొన్నారు. బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయులకు ఎక్కువ మందికి అవకాశం లభించిందని… ఇండియన్ అమెరికన్లు… సాధించిన విజయాలుగా వీటిని చూడాలని… రంగస్వామి తెలిపారు. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడిగా, అమెరికాలో భారత సంతతి నాయకుల కోసం ఏర్పాటు చేసిన సంస్థను రంగస్వామి నిర్వహిస్తున్నారు. అమెరికాలో వివిధ పొజిషన్లలో ఉన్న భారత సంతతి వ్యక్తులను గుర్తించి వారికి మద్దతుగా ఈ సంస్థ నిలుస్తోంది.

సెనేటర్ గా పనిచేసే రోజుల నుండి భారత కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించిన బైడెన్, ఇండియన్లతో తన సంబంధాల గురించి తరచుగా జోకులు వేసేవాడు. 2020లో భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకొని చరిత్ర సృష్టించాడు. ఇండియాస్పోరా సంకలనం చేసిన వారిలో వైట్ హౌస్‌లోని భారతీయ-అమెరికన్ల జాబితా చాలా పెద్దదే. అధ్యక్షుని కార్యాలయం ఓవల్ ఆఫీసులో భారతీయ-అమెరికన్లు ప్రముఖంగా ఉన్నారు. బైడెన్ ప్రసంగాల రచయిత వినయ్ రెడ్డి, కోవిడ్-19పై ప్రధాన సలహాదారు డాక్టర్ ఆశిష్ ఝా, వాతావరణ విధానంపై సలహాదారు సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్‌పై ప్రత్యేక సహాయకుడు చిరాగ్ బైన్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి కిరణ్ అహుజా నాయకత్వం వహిస్తున్నారు, నీరా టాండన్ సీనియర్ సలహాదారుగా ఉండగా… నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ గుప్తా నేతృత్వం వహిస్తున్నారు.

గత వారం అమెరికాలో భారత రాయబారి, తరంజిత్ సింగ్ సంధు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియా హౌస్‌లో రిసెప్షన్‌ను నిర్వహించినప్పుడు, US ప్రభుత్వంలోని దాదాపు అన్ని ప్రధాన శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ-అమెరికన్లు హాజరయ్యారు. వేదాంత్ పటేల్ ఇప్పుడు స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ స్పోక్స్‌పర్సన్‌గా ఉండగా, గరిమా వర్మ ప్రథమ మహిళ కార్యాలయంలో డిజిటల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతే కాదు… బైడెన్ అనేక మంది భారతీయ-అమెరికన్లను కీలక రాయబారి పదవులకు నామినేట్ చేశారు. ఇండియాస్పోరా రూపొందించిన జాబితా ప్రకారం, దేశవ్యాప్తంగా 40 మందికి పైగా భారతీయ-అమెరికన్లు వివిధ కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభలో డాక్టర్ అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ నలుగురు డెమొక్రట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు కార్పొరేట్ వరల్డ్‌లోనూ.. భారతీయ అమెరికన్లు కీలకంగా ఉన్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు భారతీయ-అమెరికన్‌లు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల నేతృత్వం వహిస్తుంటే… రెండు కంటే ఎక్కువ డజన్ల సంఖ్యలో భారతీయ-అమెరికన్లు US కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. వారిలో అడోబ్‌ సంస్థకు శంతన్ నారాయణ్, జనరల్ అటామిక్స్‌కు వివేక్ లాల్, డెలాయిట్‌కు పునీత్ రెంజెన్, ఫెడెక్స్‌కు రాజ్ సుబ్రమణ్యం నేతృత్వం వహిస్తున్నారు.