Andhra PradeshHome Page Slider

ఏపీలో రూ.1,719 కోట్లతో 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం

రైతు పండించిన పంటకు మెరుగైన ధర కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు మంగళవారం వర్చువల్‌ విధానంలో సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం చేయగా, మరో  ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా వాటికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుండగా 40,307 మంది రైతులకు మేలు జరగనుందన్నారు”.

ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం అవసరమైన ముడిసరుకును రైతుల నుంచి సేకరించే సందర్భంగా వారికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. మార్కెట్లో రైతులకు ధరలు తగ్గినప్పుడు ఆర్బీకేలు జ్యోకం చేసుకుని.. రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. రూ.8 వేల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామని, చిత్తూరులో మూడు, అన్నమయ్యలో ఒకటి..చొప్పున ఆహారశుద్ది కేంద్రాలు ప్రారంభించామన్నారు. దాదాపు 14,400 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి పండ్లు, టమాటాలు, ఇతర కూరగాయలు కొనుగోళ్లకు, ఆయా రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

మిల్లెట్స్‌కు పీడీఎస్‌లో అనుసంధానం చేసింది కూడా మన రాష్ట్రం ఒక్కటేనని, ఎంఎస్‌పీ ఫర్‌ మిల్లెట్స్‌ అనే కార్యక్రమం కూడా దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆర్బీకేల ద్వారా మంచి ధరను ప్రకటించింది మన రాష్ట్రమే అని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక సెకండ్రీ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఈ సెకండ్రీ ప్రాసెసింగ్‌ యానిట్స్‌ కూడా 7,200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో తీసుకురావడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. మార్కెట్లో రైతులకు ఇంకా మంచి ధరలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్‌ రూమ్స్‌, ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను మ్యాపింగ్‌ చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇలా చేయడం వల్ల ప్రైమరీ ప్రాసెసింగ్‌ అంటే.. గ్రేడింగ్‌ ఇతర పనులను క్షేత్రస్థాయిలో జరిగే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం మద్దతు ధర ఇవ్వని పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా మద్దతు ధర కల్పిస్తోందన్నారు.