NewsTelangana

రూ.3,786 కోట్లతో తెలంగాణలో పట్టణ ప్రగతి

తెలంగాణలో పట్టణ ప్రగతి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ3,786.78 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో రూ.3,066.21 కోట్ల నిధులు ఖర్చు చేశారు. రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి రూ.1,919.49 కోట్లు, మిగిలిన 141 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.1,866.29 కోట్లు విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక వసతులు, పారిశుధ్య పనులను మెరుగుపరిచేందుకు ఆధునిక పద్ధతుల్లో పనులు నిర్వహించామని రాష్ట్ర పురపాలక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పట్టణ ప్రగతి కోసం 125 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఇటీవల రూ.170.30 కోట్లు విడుదల చేశారు. అందులో జీహెచ్‌ఎంసీకి రూ.91.65 కోట్లు, మిగిలిన కార్పొరేషన్లకు రూ.78.48 కోట్లు విడుదలయ్యాయి.

అత్యంత నివాసయోగ్య నగరాలు, పట్టణాలున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జీహెచ్‌ఎంసీ మినహా 141 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,548 శాటిటైజేషన్‌ వాహనాల ద్వారా రోజూ 2,675 మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. పట్టణ ప్రగతి కోసం వచ్చిన నిధులతో అదనంగా 2,165 శానిటైజేషన్‌ వాహనాలను కొనుగోలు చేశారు. దీంతో 4,713 వాహనాల ద్వారా 4,356 మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. దీంతో పట్టణాలు, నగరాల్లో పారిశుధ్యం మెరుగైంది. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాలను కలుషితం కాకుండా కాపాడేందుకు 71 నగర, పురపాలక సంస్థల్లో రూ.250.73 కోట్లతో మానవ మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇతర మునిసిపాలిటీల్లోనూ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతి వేయి మందికి ఒక పబ్లిక్‌ టాయ్‌లెట్‌ ఉండాలన్న నిబంధన ప్రకారం జీహెచ్‌ఎంసీ మినహా ఇతర మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,118 పబ్లిక్‌ టాయ్‌లెట్లను (పురుషులకు 2,060, మహిళలకు 2,058) కొత్తగా నిర్మించారు. దీంతో పబ్లిక్‌ టాయ్‌లెట్ల సంఖ్య 9,088కి చేరింది. అధికారులు ప్రతి మంగళవారం, శుక్రవారం పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ను తనిఖీ చేస్తూ పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు.