గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసీ ప్రజావాణి’
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ‘ప్రవాసీ ప్రజావాణి’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు (బుధ, శుక్రవారాలు) జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాలపై నిర్ణయం తీసుకున్నం. అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసీ ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్లారు. వారి సమస్యల పరిష్కారా నికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నం. గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువుల ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నం. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరీ కమిటీకు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

