మునుగోడులో ఇక డబ్బుల పంపకంపై దృష్టి
మునుగోడులో ఇక డబ్బుల పంపకంపై దృష్టి
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నందున ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు డబ్బుల పంపకంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కడ చూసినా సరైన పత్రాలు లేని కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ఇది రాజకీయ వర్గాలను, ప్రజలను షాక్‌కు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా నల్లగొండ జిల్లాలోనూ.. హైదరాబాద్‌లోనూ హవాలా డబ్బు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో భారీగా డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంబజార్, గోషామహల్, అబిడ్స్, సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లోని గోదాముల్లో భారీగా నగదు నిల్వలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జూబ్లీహిల్స్‌లో పట్టుబడిన రూ.89.92 లక్షలు..
డబ్బులు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబరు 71లో వాహనాలను తనిఖీ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.89.92 లక్షల నగదును పట్టుకున్నారు. టీఎస్ 27 డీ 7777 అనే నెంబరు ప్లేట్ గల మహీంద్రా థార్ వాహనంలో ఈ నగదు లభించింది. మూడు రోజుల క్రితం పంజాగుట్టలో రూ.70 లక్షల నగదు పట్టుబడింది. బేగం బజార్లో రూ.48.6 లక్షలు పట్టుబడ్డాయి. నగర శివార్లలో రూ.45 లక్షలు దొరికాయి. మొత్తానికి హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రూ.20-26 కోట్ల నగదును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది.

ఓటర్లకు పంచేందుకేనా..?
నాలుగైదు రాష్ట్రాల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో పరిచయం కలిగిన హవాలా దళారులు హైదరాబాద్‌లో ఉన్నట్లు.. వీరి ద్వారానే కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ హవాలా డబ్బంతా మునుగోడులో ఓటర్లకు పంచేందుకే అని అందరూ అనుమానిస్తున్నారు. పట్టుబడిన ఈ డబ్బులు ఎవరివి..? ఏ పార్టీ తరలిస్తుండగా పట్టుబడింది..? అనే విషయాలు బయట పడలేదు. ఇప్పటి వరకు రూ.6.8 కోట్లు, 4,560 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ఫిర్యాదుల కోసం సీవిజల్ యాప్‌ను ప్రారంభించామన్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు.