Andhra PradeshHome Page Slider

నేడు సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం చేపట్టే సిబిఐ దర్యాప్తు అత్యంత కీలకంగా మారనుంది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరు కావటమే దీనికి కారణం. ఆయన అరెస్టు తప్పదని సిబిఐ అధికారులు ఇప్పటికే కోర్టుకు తెలిపిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి మంగళవారమే సిబిఐ అధికారుల ఎదుట విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు ముందస్తు షెడ్యూల్లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూనే శుక్రవారం కచ్చితంగా విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న వారికి నోటీసు అందజేశారు. ఓవైపు ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని చెప్పిన అవినాష్ రెడ్డి ఆ మరుసటి రోజే సిబిఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. మరోవైపు వివేక హత్య కేసు దర్యాప్తు చివరి దశ కు చేరుకున్న నేపథ్యంలో సిబిఐ గత కొద్దిరోజులుగా తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణ అత్యంత కీలకంగా మారనుంది. సిబిఐ నోటీసుల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా మరి ఏదైనా కారణంతో గడువు కోరతారా విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.