NewsTelangana

యువత రాజకీయాల్లోకి రావాలి

Share with

యువత కచ్ఛితంగా రాజకీయాల్లోకి రావాల్సిందేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అప్పుడే దేశ భవిష్యత్తును మార్చొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి నేపథ్యం లేకున్నా యువత రాజకీయాల్లోకి రావొచ్చని భరోసా ఇచ్చారు. సీఎం కె.చంద్రశేఖర్‌ రావు సహా ఎంతోమంది ప్రముఖులకు రాజకీయ వారసత్వం లేదని, అయినా రాజకీయాల్లో రాణించారని గుర్తు చేశారు. కాలి గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌లో ఆస్క్‌కేటీఆర్‌ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు నేను ఆరోగ్యంగానే ఉన్నా బ్రదర్‌ అంటూ నెటిజన్ల మనసు దోచారు. టీఆర్‌ఎస్‌ సర్కారు హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేస్తోందని, ఇతర జిల్లాలనూ పట్టించుకోవాలని ఓ నెటిజన్‌ వేడుకోగా.. అన్ని జిల్లాలపై దృష్టి సారించాం బ్రదర్‌ అని సమాధానమిచ్చారు.


ఎన్నికల పోరులో చాలా మంది ఉన్నారు
వచ్చే ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీతో పోరాడతారని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ను చూస్తుందా? బీజేపీని పరిగణిస్తుందా? రెండు జాతీయ పార్టీలతో ఒకేసారి యుద్ధం చేయగలరా? అంటూ ఓ పార్టీ అభిమాని అనుమానాలు వ్యక్తం చేయగా.. జాతీయ పార్టీలతో పాటు పోరులో ఇంకా చాలా మంది ఉన్నారని కేటీఆర్‌ తనదైన శైలిలో ముక్తాయించారు. గత ఆరు నెలల్లో సీఎం కేసీఆర్‌ ప్రొటోకాల్‌ను మూడుసార్లు ఉల్లంఘించారని, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తే సీఎం హోదాలో కేసీఆర్‌ స్వయంగా వెళ్లి ఆహ్వానించకపోవడం పట్ల ఓ నెటిజన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని కన్నా తెలంగాణ సీఎం గొప్పవారా? అని అనుమానం సైతం వ్యక్తం చేశారు. దీనికి హిందీలో సమాధానం ఇవ్వాలని కోరాడు. దీనికి.. సీఎం కేసీఆర్‌ ప్రొటోకాల్‌ను స్పష్టంగా పాటించారని కేటీఆర్‌ వివరించారు. ప్రధాని అయినా.. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే సీఎం వెళ్లి ఆహ్వానించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పైగా ఈ విషయం హిందీలో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జాతీయ జెండాను సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ పిక్‌గా మార్చినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందదని, జీడీపీ మారితేనే దేశం ముందుకెళ్తుందని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.


ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ
తదుపరి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున సీఎం అభ్యర్థిగా మీరు ముందుకొస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం దాటవేశారు. అయితే, కేసీఆర్‌ రూపంలో సమర్ధుడైన సీఎం మనకు ఉన్నారని, తెలంగాణ ప్రజల దీవనెతలతో ఆయన హ్యాట్రిక్‌ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. టీఆర్‌ఎస్‌ మౌనంగా ఉండటంపై ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఖాళీ గిన్నెటకు మోత ఎక్కువ అంటూ బీజేపీని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. దసరా పండుగ నాటికి రాష్ట్ర సచివాలయం సిద్ధమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నానని, అలాంటి అవకాశం ఉందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. తన రాజకీయ ప్రసంగాలను ఇప్పటివరకూ చూడకుంటే బిగ్‌ స్క్రీన్‌పై చూడాలంటూ చలోక్తి విసిరారు. భారత్‌లాంటి దేశంలో సమతుల్యత అవసరమని, విద్యుత్తు రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని విద్యుత్తు సంస్కరణలపై మంత్రి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో గొప్పగా చేస్తున్నారని కేటీఆర్‌ను ప్రశంసించిన ఓ అభిమాని దోమల నివారణలో వైఫల్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై ప్రజలు కూడా తమ వంతు కృషి చేయాలని, అందుకే 10 మినిట్స్‌ - 10 ఏఎం కార్యక్రమాన్ని తీసుకొచ్చామని కేటీఆర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌తో పాటు ఇతర క్రీడలనూ ప్రోత్సహిద్దామన్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. అదే సందర్భంలో ప్రతిపక్షాలపై సందర్భోచిత విమర్శలతో ఆకట్టుకుంటారు.