ట్విటర్ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ట్విటర్‌ను కొనేందుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి ప్రతి సంవత్సరం 1.2 బిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే.. ఈ సామాజిక మాధ్యమం నుంచి ప్రకటనదారులు ఇటీవల దూరమయ్యారు. దీంతో ఆదాయం పడిపోయిందని.. దాన్ని భర్తీ చేసుకునేందుకు ట్విటర్ వినియోగదారుల నుంచి సబ్స్క్రిప్షన్ ఫీజుగా నెలకు 8 డాలర్లు త్వరలో వసూలు చేసేందుకు ప్లాన్ రూపొందించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఎలాన్ మస్క్ చెప్పారు.

ఉద్యోగులు త్యాగాలకు సిద్ధం కావాలి..
సంస్థను ముందుకు నడిపించేందుకు త్యాగాలకు సిద్ధం కావాలంటూ ఉద్యోగులకు మస్క్ పలు హెచ్చరికలు చేశారు. వారంలో 80 గంటలు అంటే రోజూ 12 గంటలకు పైనే పని చేయాలని సూచించారు. ఉచిత భోజనం, వర్క్ ఫ్రం హోం వంటి సదుపాయాలను వదులుకోవాలన్నారు. తన సూచనలు నచ్చని వారు రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. మస్క్ ఇప్పటికే ఉద్యోగులను భారీగా తొలగించారు. మరికొందరు రాజీనామా చేశారు. తాజాగా మస్క్ కొత్త బృందంలో కీలక బాధ్యతల్లో ఉన్న యోల్ రోత్, రాబిన్ వీలర్ రాజీనామా చేశారు. ట్విటర్ విశ్వసనీయత, భద్రతకు సంబంధించిన అంశాలను చూసే బాధ్యతను రోత్ ఇటీవలే స్వీకరించారు. ప్రకటనదారులతో సంబంధాలను మెరుగుపరిచే పర్యవేక్షణ వీలర్ చేతిలో ఉంది.

ఆదాయం పెరగకుంటే ట్విటర్ దివాళా..?
ట్విటర్ ఆదాయాన్ని పెంచుకోకుంటే దివాళా తీసే పరిస్థితిని కొట్టిపారేయలేమని మస్క్ హెచ్చరించారు. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను వదులుకొని సంస్థ కోసం మరింత కష్టపడాలని ఉద్యోగులకు స్పష్టం చేశారు. ట్విటర్‌ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంట్లో 13 బిలియన్ డాలర్లను ఏడు బ్యాంకులు రుణంగా సమకూర్చాయి. ఈ రుణాన్ని వదిలించుకునేందుకు బ్యాంకులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఫెడ్ కంపెనీలు ఒక డాలర్ రుణానికి 60 సెంట్లు మాత్రమే ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. బ్యాంకులు కనీసం 70 సెంట్లు ఇస్తే వదిలించుకుందామని చూస్తున్నాయట. బ్యాంకులు రుణంలో 30 శాతం నష్టపోయేందుకూ సిద్ధమయ్యాయంటే ట్విటర్ ఆర్థిక పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్ధమవుతోంది.