పథకాల పేరుతో వైసీపీ ఇంటింటా నిఘా
◆ కొత్తగా కోఆర్డినేటర్లు, గృహ సారథుల నియామకం
◆ 50 కుటుంబాలకు ముగ్గురుని నియామకంపై భిన్నాభిప్రాయాలు
◆ స్వేచ్ఛకు దూరమవుతామేమో అని అంటున్న ప్రజానీకం
◆ వేరే పార్టీలో తిరిగితే సంక్షేమ పథకాలు కట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చామని ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించటం వృద్ధులు వికలాంగులు వితంతువులకు పెన్షన్ ప్రతినెలా ఒకటో తారీకు అందించటం ద్వారా ఆ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యింది. అంతవరకు బానే ఉన్నా రాజకీయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం వెంపర్లాడుతున్నాయి. ఓటర్ బలహీనతలపై పార్టీలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ఎక్కువగా పనిచేసేవని ప్రస్తుతం వాటి స్థానంలో సంక్షేమ పథకాలు పేరుతో ఓటర్లను పార్టీలు బంధిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఏపీలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించిన జగన్ ప్రభుత్వం వారి బాధ్యత మీదే అంటూ వారి ఓట్లు కూడా మీరే కాపాడాలని అంటూ వాలంటీర్లకు ఆ పనిని అప్పచెప్పారు.

ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఎన్నికల సమయం దగ్గర పడటంతో వ్యూహాలకు పదును పెట్టి కొత్తగా సచివాలయ పరిధిలో కోఆర్డినేటర్లు, 50 కుటుంబాలకు ముగ్గురు గృహసారధులను నియమించటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మా మీద నిఘా ఏమిటి పథకాల పేరుతో ఇంటింటా నిఘా ఏర్పాటు చేయడమేమిటి? ఇలా నియమించటం ద్వారా స్వేచ్ఛకు దూరమవుతున్నామని ప్రజానీకం అంటున్నారు. అంతే కాకుండా కోఆర్డినేటర్లు గృహసారథలు రావడంతో స్థానిక నేతలకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా వాపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఆ ప్రజల కార్యకలాపాల మీదనే నిఘా పెట్టటం సభబేనా అని ఇప్పటికే వార్డు సచివాలయాల ద్వారా 50 ఇళ్లకు వాలంటీర్లను నియమించడం వల్ల స్వేచ్ఛను కోల్పోయామని ప్రజలు అంటున్నారు. కొత్తగా నియమించిన కోఆర్డినేటర్లు గృహసారధులు పార్టీ పెద్దలకు దగ్గరగా ఉంటారని ఎమ్మెల్యేలతో నేరుగా సంబంధాలు ఉంటాయని ఈ క్రమంలో 50 ఇళ్లకు సంబంధించి ప్రతి ఇంటి విషయాలు వారికి చేరవేయడం ద్వారా తమ సంక్షేమ పథకాలు కట్ చేస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఆ పార్టీ నేతలు, పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండానే నేరుగా సీఎం బట్టన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి డబ్బులు చేరిపోయేలాగా చేస్తూ వస్తున్నారు. దీంతో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులకు ఎక్కడ ప్రాధాన్యత దక్కకుండా పోవడం ప్రజలు వీరిని లెక్క చేయకపోవడం ఇప్పటికే జరుగుతూ ఉన్న పరిణామం. ఈ క్రమంలో ప్రజలతో నేరుగా సంబంధాలు కావాలంటే కోఆర్డినేటర్లు ఉపయోగపడతారని ఆలోచనతో ఈ కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు ప్రజల పరిస్థితులను నేతల కదలికలను కూడా ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తెస్తారని అంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీకి చెందిన వ్యక్తులను ప్రతి 50 కుటుంబాలకు నియమించడం ద్వారా తమ స్వేచ్ఛ దెబ్బతింటుందని ప్రజలు భావిస్తున్నారు.

