Home Page SliderNational

మహిళలకూ కావాలి రీఛార్జ్

మహిళలు నిరంతరంగా పనిచేస్తూ చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. నిద్ర లేచింది మొదలు..రాత్రి నిద్రపోయేంత వరకూ ఎన్నో పనులతో సతమతమవుతూ ఉంటారు. ఇంటి పనులు, పిల్లల పనులు, ఆఫీస్ బాధ్యతలు అన్నింటిలోనూ చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకే వారి పనులకు కూడా బ్రేక్ అవసరం. వారికి కూడా శరీరం రీఛార్జ్ కావలసి వస్తుంది. ఒక్కొక్కసారి తీవ్ర ఒత్తిడితో ఇక నావల్ల కాదు అనే సంకేతాలను శరీరం పంపిస్తుంది. మన శరీరం ఇచ్చే సూచనలు గమనించి, కొంత రెస్టు తీసుకోవడం అవసరం. నిర్విరామంగా పనులు చేస్తూ శరీరాన్ని బలవంత పెడితే దానివల్ల శారీరక ఆరోగ్యమే కాదు, మానసికంగా కూడా సమస్యలు వస్తాయి.

శరీరం అలసిపోయిందని తెలియజేసే మొదటి లక్షణం తలనొప్పి. తలనొప్పి వస్తే సాధారణంగా చాలామంది మహిళలు పట్టించుకోరు. టాబ్లెట్ వేసుకుని మళ్లీ పనిలో పడిపోతారు. కానీ దీని ప్రభావం ఎంతోసేపు ఉండదు. పదే పదే తలనొప్పి వస్తే దానిని అశ్రద్ధ చేయకూడదు. ఎక్కువ వెలుతురును చూడలేకపోవడం, కళ్లు మసకబారడం, శబ్దాలు వింటే తలనొప్పి రావడం, తల పట్టేస్తున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే పని నుండి తప్పనిసరిగా విరామం తీసుకోవాలి. అలాగే పనిలో మనసు లగ్నం చేయకపోవడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకం లేకపోవడం వంటి లక్షణాల వల్ల మెదడు మొద్దుబారుతుంది. అప్పుడు యాంత్రికంగా పని చేస్తున్నా, దానివల్ల సరైన ప్రయోజనం ఉండదు. అప్పుడు కూడా విరామం తీసుకోండి. అలాగే అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి వంటి సమస్యలను కూడా గుర్తించి, దానికి తగిన సమయం ఇవ్వాలి.

ఇలా ఒత్తిడికి గురయినప్పుడు ఆయా పనుల నుండి విరామం తీసుకుని రీఛార్జ్ అవ్వాలి. గార్డెనింగ్ చేయడం, సంగీతం వినడం, స్నేహితులతో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, వ్యాయామం వంటి పనుల ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది. మరీ జీవితం బోర్‌గా ఉంది అనిపిస్తే ఒక వారం వెకేషన్ తీసుకుని వెళ్లి రావడం కూడా మంచిదే.