పబ్‌జీ ప్రేమతో భారత్‌లోకి..ఆ పాక్ మహిళను వెళ్లగొడతారా..?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తానీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీమా హైదర్ అనే పాకిస్తాన్ మహిళ రెండేళ్ల క్రితం పబ్‌జీ వీడియోగేమ్‌లో పరిచయమైన భారత్ వ్యక్తి సచిన్ మీనాని ప్రేమించింది. అతడి కోసం భర్తను విడిచిపెట్టి, నలుగురు పిల్లలను తీసుకుని భారత్‌లోకి వచ్చింది. అప్పట్లో ఈ సంఘటన సంచలనమయ్యింది. అనంతరం అతనిని వివాహం చేసుకుని హిందూ మతాన్ని స్వీకరించానని చెప్పింది. ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారత ప్రభుత్వానికి తనను భారతీయురాలిగా గుర్తించాలని, తనను ఆ దేశానికి పంపొద్దని విజ్ఞప్తి చేసింది. ఆమె లాయర్ మాట్లాడుతూ ఆమె భారత కుటుంబానికి కోడలని, ఇక్కడ వ్యక్తిని వివాహం చేసుకుని ఒక కుమార్తెకు కూడా జన్మనిచ్చిందని తెలిపారు. ఆమె దేశాన్ని విడిచివెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు. అయితే పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని వీసాలు ఏప్రిల్ 27తో రద్దు కానున్నాయి. మెడికల్ వీసాలు కూడా ఏప్రిల్ 29 వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

