NewsTelangana

బీజేపీకి అస్త్రంగా గిరిజన రిజర్వేషన్‌ జీవో..?

మునుగోడు ఉప ఎన్నికకు ముందు బీజేపీకి మరో అస్త్రం దొరికింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇరకాటంలో పడ్డారు. గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచుతామని.. దీనికి సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్‌ ఈ నెల 17వ తేదీన ప్రకటించారు. దమ్ముంటే అడ్డుకోవాలని మోదీ సర్కారుకు సవాల్‌ కూడా విసిరారు. అయితే.. 12 రోజులు గడిచినా జీవో జారీ కాలేదు. భూమి, భుక్తి లేకుండా.. ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధు ఇస్తానని కూడా చెప్పారు. ఆ విషయమూ ఇంతవరకూ తేలలేదు. ఇవి బీజేపీకి సరికొత్త అస్త్రాలుగా మారాయి.

మునుగోడు కోసమే గిరిజన బంధు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దళిత బంధు ప్రకటించిన కేసీఆర్‌.. మునుగోడు ఉప ఎన్నిక కోసమే గిరిజన బంధు పథకాన్ని ప్రకటించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి.. గిరిజనుల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనే కేసీఆర్‌ హామీ ఇచ్చారు. గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటి వరకూ వాటి ఊసే లేదు. పైగా పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ, బంజారా రైతులపై ఫారెస్టు అధికారులు దాడులు చేస్తున్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలని గిరిజన గిరిజన, ఆదివాసీల ఐక్య పోరాట సంఘం డిమాండ్‌ చేసింది.

బీజేపీ అధికారంలోకి వస్తే తొలి సంతకం గిరిజన రిజర్వేషన్‌పైనే..

గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచాలంటూ 33 గిరిజన సంఘాలు ఎంతో కాలంగా పోరాడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తొలి సంతకం గిరిజన రిజర్వేషన్ల పెంపు ఫైల్‌పైనే చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్‌ను ముస్లిం రిజర్వేషన్లతో కలపడం వల్లే అమలుకు నోచుకోలేదని వివరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లతో లింక్‌ పెట్టకుండా.. కేంద్రంతో సంబంధం లేకుండా గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి బీజేపీపై సంధించిన గిరిజన రిజర్వేషన్‌ అస్త్రం తిరిగి కేసీఆర్‌కే తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.