మానకొండూరు గెలుపు ఆ పార్టీదేనా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో ఎస్సీ నియోజకర్గంలో మానకొండూరులో… ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. గతంలో డైరెక్ట్ ఫైట్ కు కేంద్రంగా ఉండే ఈ నియోజకవర్గంలో అటు బీజేపీ సైతం మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ ను బరిలో నిలపడంతో ఇప్పటికే హీటెక్కిన రాజకీయాలు మరింత ఉత్కంఠ గురిచేస్తున్నాయి. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన అరేపల్లి మోహన్… తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరించినప్పటికీ ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఐతే ఆ తర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకొని మానకొండూరు సీటు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఇక్కడ్నుంచి విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తనదే విజయమన్న దీమాతో ఆయన ఉన్నారు. నియోజకవర్గంలో రసమయి బాలకిషన్ రెండు సార్లు గెలిపించినా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని అటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రసమయి వల్ల తెలంగాణ కళాకారులకు ఎలాంటి మేలు జరగలేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

మానకొండూరు ఎస్సీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల సంఖ్య 316. పురుష ఓటర్లు 1,07,371కాగా మహిళా ఓటర్లు 1,11,041 మంది ఉన్నారు. ఒక ట్రాన్స్ జెండర్ ఓటరుగా నమోదు చేసుకోగా మొత్తం ఓటర్లు 2,18,413 ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు, రెడ్లు, బీసీలు మొత్తం ఓటర్లలో 50 శాతం వరకు ఉన్నారు. మాదిగలు 15 నుంచి 16 శాతం మేర ఉండగా, రెడ్లు 15 శాతానికి పైగా ఉన్నారు. ఇతర బీసీలు 14 శానితికి పైగా ఉన్నారు. తెనుగు-ముదిరాజ్ సైతం 9 శాతానికి పైగా ఉన్నారు. మాలలు సుమారుగా 9 శాతం వరకు ఉన్నారు. గౌడలు ఎనిమిదిన్నర శాతం, మున్నూరుకాపులు 7 శాతం, పద్మశాలీలు 5 శాతం గొల్ల-కురుమలు 4 నుంచి 5 శాతం మేర ఉన్నారు. విశ్వబ్రహ్మణులు 4 శాతం ఉండగా, ఇతరులు 9 శాతం వరకు ఉన్నారు.