ఎన్నికలొస్తున్నాయ్.. రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారు?
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 50 శాతం నిధులు కూడా విడుదల కావడం లేదని… కొన్ని డిపార్ట్మెంట్స్కి ముఖ్యంగా సంక్షేమ శాఖలకు డబ్బులు విడుదల చేయకుండా మోసం చేసిన చరిత్ర ప్రభుత్వానిదని దుయ్యబట్టారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో పెట్టీ నాలుగేళ్లు గడిచినా మాఫీ చెయ్యలేదని… బడ్జెట్లో దాని ప్రస్తావన కూడా చెయ్యలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతున్నారని… SERP, VOA లకు జీతాలు3900/- మాత్రమే ఇస్తున్నారన్నారు. పక్కన ఉన్న ఏపీలో 10 వేలు ఇస్తున్నారన్నారు. అంగన్ వాడీలకు వెయ్యి నుంచి మూడు వేలిస్తామంటున్నారని… సక్రమంగా ఇవ్వాలన్నదే తన డిమాండ్ అన్నారు. కేసీఆర్ కిట్‌ను, పిల్లలు పుట్టాక ఇస్తున్నారన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో క్లాస్ రూంలు ఏ మాత్రం మెరుగవలేదన్నారు. ఎల్బీ నగర్‌లోని వీఎం హోంలో టాయిలెట్ లేక చెంబు పట్టుకొని బయటకి వెళ్తున్నారు అని పత్రికల్లో వార్తలు రావడం బాధాకరమన్నారు. ఆరోగ్య శ్రీ, EHS డబ్బులు రాక ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందడం లేదన్నారు. కాంట్రాక్టర్స్ కి డబ్బులు లేక… ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దేశంలో ఈ ఘనత ఒక్క తెలంగాణలోనే ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్ల కోసం పెట్టుకున్న GPF ఇవ్వడం లేదన్నారు ఈటల రాజేందర్. గొప్ప అభివృద్ధి అని చెప్తున్న మీరు బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు వల్ల ఎంత ఆదాయం పెరిగింది కూడా చెప్పాలన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు సమయానికి ఇవ్వాలని, సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించాలని, జీతాలు మొదటి తారీఖు ఇవ్వాలని ఈటల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

