News AlertTelangana

మత మార్పిడి, లవ్ జిహాదులను అడ్డుకుంటాం..

దేశంలో పెరిగిపోతున్న మతమార్పిడి, లవ్ జిహాద్ లను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ ( VHP) జాతీయ సంఘటన కార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే పేర్కొన్నారు. 1964 లో ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్.. 2024 నాటికి 60 సంవత్సరాలు ( షష్టి పూర్తి) పూర్తి చేసుకుంటుందని.. అప్పటికి దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలను గ్రామ గ్రామాన విస్తరిస్తామన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి విశ్వహిందూ పరిషత్ ముఖ్య నాయకుల శిక్షణ శిబిరం శనివారం ఉదయం బండ్లగూడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ప్రారంభమైంది.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వినాయక రావు గారు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ శక్తిని పెంచేందుకు విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.  ఇప్పటికే ప్రపంచంలోని అరవై దేశాలలో తమ సంఘం పనిచేస్తుందన్నారు. భారతదేశంలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా గ్రామాల్లో VHP పని చేస్తుందని.. వచ్చే రోజుల్లో కార్యాన్ని మరింత విస్తృత పరుస్తామన్నారు. ముఖ్యంగా భారతదేశంలో పెరిగిపోతున్న మతమార్పిడులను అడ్డుకునేందుకు హిందువులను చైతన్యం చేస్తున్నామన్నారు. అదేవిధంగా హిందూ యువతులను కాపాడుకునే క్రమంలో లవ్ జిహాద్ అడ్డుకుంటామని ఆయన అన్నారు.

ముక్కోటి దేవతలకు నిలయమైన గోవులను కాపాడి దేశ వ్యవసాయ రంగానికి విశ్వహిందూ పరిషత్ అండగా ఉంటుందన్నారు. విశ్వహిందూ పరిషత్ కార్యంలో మహిళలు యువకులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. లవ్ జిహాద్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దుర్గా వాహిని.. బజరంగ్ దళ్ ను తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి 250 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ శిబిరం ముగుస్తుంది. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యం,  దక్షిణ భారత నాయకులు కేశవ్ హెడ్గే , తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, సంఘటన కార్యదర్శి యాది రెడ్డి , సహకార దర్శులు భాను ప్రసాద్, రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.