పంజాబ్ పోలీసులతో ‘వారిస్ పంజాబ్ దే’ సమరం
అమృత్‌సర్‌లో భారీ ర్యాలీ
తుపాకులు, కత్తులతో ప్రదర్శన
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌ను ఛేదించుకుని ప్రదర్శనకారులు బాహాబాహీకి దిగారు. భారీ బడ్జెట్ సినిమా దృశ్యాలకు పోటీగా ఉన్న దృశ్యాలతో హల్చల్ చేశారు. స్వయంప్రకటిత మత బోధకుడు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు, పోలీసులతో కలబడ్డారు. ‘వారిస్ పంజాబ్ దే’ గ్రూప్ చీఫ్ అమృతపాల్ సింగ్ అనుచరులు, అతని సన్నిహితురాలు లవ్‌ప్రీత్ తూఫాన్ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కత్తులు, తుపాకులతో ఆయుధాలు ధరించి, లౌడ్‌స్పీకర్లతో పోలీసులపైకి దూసుకొచ్చారు. ఆర్మడ అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న ఫెన్సింగ్‌ను దాటుకొని, పోలీసులపై దాడికి దిగారు.

‘‘కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. ఒక్క గంటలో కేసును రద్దు చేయకపోతే ఇక ఏం జరిగినా దానికి అడ్మినిస్ట్రేషన్‌దే బాధ్యత అని.. మేమేమీ చేయలేమని భావిస్తున్నారని, అందుకే ఈ బలప్రదర్శన చేపట్టాం” అని అమృతపాల్ సింగ్ అన్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను నియంత్రించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ANI వార్తా సంస్థ పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’ గ్రూపునకు అమృతపాల్ సింగ్ అధిపతి.

