‘బరువు తగ్గు, నిధులు పట్టు’- గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఉజ్జయిని ఎంపీ
ఉజ్జయినిలోని మాల్వాలో అభివృద్ధి పనులకోసం ఉజ్జయిని ఎంపీ పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుపట్టి వేలకోట్లు సాధించారు. ఈ సంఘటనకు పునాది ఈ ఏడాది ఫిబ్రవరిలో పడింది. అప్పట్లో ఉజ్జయినిలోని మాల్వాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన నితిన్ గడ్కరీ అక్కడికి వచ్చారు. అప్పుడు అధిక బరువుతో బాధపడుతున్న ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసి గడ్కరీ నివ్వెరపోయారు. ఎంతో కాలంగా తన నియోజకవర్గానికి నిధులు కేటాయించమని అనిల్, గడ్కరీని కోరుతున్నారట.

అయితే అనిల్ అవతారం చూసిన గడ్కరీ నిధులు కేటాయించాలంటే ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే ఉజ్జయిని అభివృద్ధికి నిధులు కావాలంటే ముందు బరువు తగ్గాలని, ఎన్ని కేజీలు తగ్గితే కేజీకి 1000 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తానంటూ ఆశ పెట్టారు. అంతే కాదు తాను కూడా 135 కేజీలు ఉండేవాడినని, ఇప్పుడు 93 కేజీలకు తగ్గానని పాత ఫొటో కూడా చూపించారు.దీనితో ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్న ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజక వర్గ అభివృద్ధి కోసం 32 కేజీలకు పైగా తగ్గారట. యోగా, ఫిజికల్ ఎక్సర్ సైజలు, డైటింగ్ చేస్తూ దాదాపు 32 కేజీల బరువు తగ్గి గడ్కరీని కలిసారు.

దానితో ఆయన ఎంతో సంతోషించి తను ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి 2,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రణాళికలను ఆమోదించారు. ఈ విషయాన్ని అనిల్ మీడియాతో పంచుకున్నారు. మొత్తానికి ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు అంత నిధుల్ని కూడా సాధించిన ఎంపీ అనిల్ ఎంతో అభినందనీయుడు.


 
							 
							