ఉద్దవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట..
శివసేన వ్యవహారం సుప్రీంకోర్టులో కీలకం పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ సహకారంతో తిరుగుబాటు చేసి మెజార్టీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుని సీఎం పీఠాన్ని ఏక్‌నాథ్ షిండే దక్కించుకున్నారు. తమదే నిజమైన శివసేన అని, పూర్తి నియంత్రణ మాకే ఉంటుందని కోరుతూ ఈసీని ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏక్‌నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై స్పందించిన ఈసీ ఆగస్టు 8లోగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రాజ్యాంగబద్ధమైన బెంచ్‌కు సిఫార్సు చేయాలా? వద్దా? అనే విషయంపై సుప్రీం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది.
షిండే వర్గాన్ని ఉద్దేశించి ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు సీజే ఎన్వీ రమణ.. ‘‘మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా?’’ అని తెలుసుకోవాలని ఉందని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను ఉద్దేశించి సీజే ఎన్వీ రమణ ప్రశ్నించారు.
రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం తేలేవరకు ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని ఉద్దవ్ థాక్రే వర్గం.. సుప్రీంను అభ్యర్థించింది. అయితే రాజ్యాంగబద్దమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమనే అసలైన వర్గంగా గుర్తించాలని, ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని షిండే వర్గం సుప్రీంలో వాదన వినిపించింది. ఈ తరుణంలో షిండే గ్రూప్ పిటిషన్‌పై ప్రతికూలంగా స్పందించిన బెంచ్.. శివ సేన నియంత్రణను షిండే వర్గానికి అప్పగించ్చొద్దంటూ ఈసీకి సూచించింది.