ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తొలిసారి సిసోడియా పేరు
లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన చార్జిషీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ తొలిసారిగా నిందితుడిగా చేర్చింది. ఇవాళ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ ధాల్‌ల పేర్లను సీబీఐ చేర్చింది. ఈ కేసులో ఇతర నిందితుల పాత్రపై ఏజెన్సీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. గత వారం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ దాదాపు తొమ్మిది గంటలపాటు ఈ కేసులో సాక్షిగా విచారించింది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా విచారించారు.

మద్యం పాలసీ కేసును “కల్పితం” అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. ఆప్ జాతీయ పార్టీగా మారినందున కేంద్రం దానిని లక్ష్యంగా చేసుకుందని ఆయన అన్నారు. ఆప్ పార్టీ చేస్తున్న మంచి పనులు, ఆప్ చేస్తున్న అభివృద్ధిని చులకన చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. సిసోడియా సైతం, ఎలాంటి తప్పు చేయలేదని, బెయిల్ దరఖాస్తులో తనకు వ్యతిరేకంగా సెంట్రల్ ఏజెన్సీ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సిసోడియాను ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా జోక్యంతో సీబీఐ కేసు కేసు విచారణ మొదలుపెట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. సిసోడియా మినహా అందరూ బెయిల్‌పై ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన మద్యం పాలసీకి సంబంధించి సిసోడియా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

సిసోడియా అరెస్ట్ “ఢిల్లీ పాలనా విధానంపై దాడి” అని ఆప్ పేర్కొంది. పాలసీ రూపకల్పనలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని, దీని వల్ల మద్యం కంపెనీలకు 12 శాతం లాభం చేకూరిందని సీబీఐ వాదిస్తోంది. “సౌత్ గ్రూప్” మద్యం లాబీ దాని కోసం కిక్‌బ్యాక్ చెల్లించిందని ఏజెన్సీ ఆరోపించింది. ప్రతిపాదిత 12 శాతం లాభంలో ఆరు శాతం మధ్యవర్తుల ద్వారా ఆప్ నేతలకు మళ్లించారని నిఘా సంస్థలు ఆరోపిస్తున్నాయి. కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం విచారణ జరుపుతోంది. మద్యం విధానాన్ని రద్దు చేసిన తర్వాత, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం పాలసీకి తిరిగి అమలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది.

