మరణశిక్షపై ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీలలో 37 మందికి బైడెన్ శిక్షను తగ్గించారు. దీనితో ట్రంప్ మండిపడ్డారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. “అధ్యక్షుడు జో బైడెన్ చర్యను ఖండిస్తున్నా. ఆయన 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. కానీ నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక, వెంటనే రేపిస్టులకు, హంతకులకు మరణశిక్ష విధిస్తాను” అని పేర్కొన్నారు. గతంలో కూడా ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చేంత వరకూ కొందరు ఖైదీలకు మరణశిక్ష అమలు చేయలేదు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే 13 మందికి ఈ శిక్ష అమలు చేశారు. ఇలా 1988 నుండి 2021 వరకూ 79 మందికి మరణశిక్ష పడితో 16 మందికి మాత్రమే అమలు చేశారు. అమెరికాలోని 50 రాష్ట్రాలలో 23 రాష్ట్రాలు దీనిని పూర్తిగా రద్దు చేశాయి. అయితే ఈ సంవత్సరం అత్యధికంగా 25 మందికి మరణశిక్షలు అమలు చేశారు. ఈ శిక్షతో దేశంలో శాంతిభద్రతలు పునరుద్దరిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.

