Home Page SliderTelangana

బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి టఫ్ ఫైట్

బాల్కొండ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగి అటు కేసీఆర్, ఇటు కుమార్తె కవితతో సన్నిహితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు ప్రశాంత్ రెడ్డి. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉంటూ అటు నియోజకవర్గంపైనా చెరగని ముద్ర వేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అధికార పార్టీకి తల్లోనాలుకలా మారారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల గోదాలోకి దిగిన ప్రశాంత్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ రెడ్డితో తలపడుతున్నారు. గతంలో బీఎస్పీ నుంచి ఆయన పోటీ చేసినప్పటికీ ప్రశాంత్ రెడ్డి సునాయాశంగా విజయం సాధించారు. అయితే ఈసారి సునీల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలుచుండటంతో… గట్టి పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ సైతం బీజేపీ తరపున బాల్కొండ బరిలో దిగారు. మొత్తంగా బాల్కొండలో మరోసారి విజయం సాధించి హాట్రిక్ విజయాలు నమోదు చేయాలని చూస్తున్న మంత్రి ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.

బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 246 ఉండగా, పురుష ఓటర్లు 99,728 స్త్రీ ఓటర్లు 1,15,898 ట్రాన్స్‌జెండర్లు ఇద్దరు, మొత్తం ఓటర్లు 2,15,628 ఉన్నారు. బాల్కొండలో కాపు సామాజికవర్గం ఓటర్లు సుమారుగా 20 శాతానికి పైగా ఉన్నారు. గురాడి కాపు 12 శాతం ఉండగా, మున్నూరు కాపు 8 శాతం ఉన్నారు. పద్మశాలీలు 12 శాతం, మాదిగలు 10, మాల 9 శాతం మేర ఉన్నారు. ముస్లింలు ఏడు శాతం, ముదిరాజ్‌లు ఆరున్నర శాతం, చాకలి కొంచెం అటూ ఇటూగా 6 శాతం వరకు ఉన్నారు. గౌడలు ఐదున్నర శాతం, వడ్డెర 5 శాతం, లంబాడ 4 శాతం వరకు ఉన్నారు. ఇతరులు 13-15 శాతం వరకు ఉన్నారు.