వైసీపీకి ఇప్పటి వరకు ముగ్గురు ఎంపీల రాజీనామా
సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై చెప్పారు. మిస్టర్ క్లీన్ గా గుర్తింపు పొందిన వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి టాటా చెప్పారు. గత కొద్ది రోజులుగా గుంటూరుకు వెళ్లాల్సిందిగా పార్టీ కోరడంతో ఆయన అలకబూనారు. పోటీ చేస్తే నరసరావుపేట నుంచే నంటూ ఆయన తేల్చి చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. నరసరావుపేట నుంచి మరో అభ్యర్థిని బరిలో దించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తోండటంతో, ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే వైసీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గుడ్ బై చెప్పగా, తాజాగా లావు సైతం రాజీనామా చేశారు.

రాజీనామా సందర్భంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా అనిశ్చితి నెలకొందని.. అది తన వల్ల కాదని… అది తాను కోరుకోలేదని చెప్పారు. అనిశ్చితి వల్ల వల్ల పార్టీకిగానీ, తనకు గానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. పార్టీ తీరుతో కేడర్ అంతా కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో కూరుకుపోయిందన్నారు. ఎటువైపు వెళ్లాలన్నదానిపై కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారన్నారు. ఆ మొత్తం అయోమయానికి తెరదించాలనేదే తన ఉద్దేశమని లావు చెప్పారు. సొల్యూషన్ వెదకాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేశానన్నారు.

15 రోజులుగా ఏం జరుగుతుందో అందరికీ తెలుసునన్న లావు శ్రీకృష్ణదేవరాయలు… పార్టీ ఆలోచన మేరకు రాజీనామా నిర్ణయమని చెప్పారు. పార్టీ కొత్త అభ్యర్థిని తేవాలని చూసిందని… దాని వల్ల గందరగోళం నెలకొందని చెప్పారు. ఇది తాను కోరుకోలేదని చెప్పారు. అందుకే వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామాతో గందరగోళం తొలగిపోతుందని ఆశిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన అవకాశం మేరకు నాలుగున్నరేళ్లుగా పనిచేశానన్నారు. సహకరించిన ఎమ్మెల్యేలందరికీ కృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు.

