మాటలకు ఎక్కువ, చేతలు తక్కువ ఇదే రేవంత్ పాలన
సీఎం రేవంత్ కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు .సికింద్రాబాద్ కస్తూర్బానగర్‌లో వరద ముంపుకు గురైన 1,500 కుటుంబాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నాలాలను శుభ్రం చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నగరంలో 7–8 మంది నాలాల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. రోడ్లు గుంతల మయమైపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. “పోర్ట్ సిటీ కోసం కాంట్రాక్టర్ల ఆరాటం ఎందుకు? ముందుగా నాలాలు, రోడ్లు సరిచేయాలి” అని హితవు పలికారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంపై కూడా హరీశ్ రావు మండిపడ్డారు. కేవలం కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని సీఎం చెబుతున్న వైఖరిని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకునేలా చూడాలని కోరారు. వరదలతో మునిగిపోయిన పంట పొలాలకు రైతులకు వెంటనే పరిహారం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద ముంపు బాధితులను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

