‘ఇది ఇండియా..హిందీయా కాదు’.. ప్రముఖనటుడు
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, కేంద్రంలోని బీజేపీ పార్టీల మధ్య డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై వివాదాలు అధికమవుతున్నాయి. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఏకీభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ఇండియాను హిందీయాగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికలలో మెజారిటీ సాధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. తమిళ ప్రజలు భాష కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతారని, ఆటలొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలు తగ్గవని, సీఎం స్టాలిన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

