NationalNewsNews Alert

ఇదేం ఫుడ్డురా .. బేవకూఫ్ – రెచ్చిపోయిన శివసేన ఎమ్మెల్యే

Share with


పదవి చేతిలో ఉంది. అధికారం అండగా ఉంది. ఇంకే కావాలి. ఎంత రెచ్చి పోతే అంత పేరు. దానికి తోడు సందర్భం కూడా దొరికిందా ఇక ఎదుటి వారికి ఇత్తడే ఇత్తడే. ఇప్పుడు మహారాష్ట్రలో ఇదే జరిగింది. మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా అందిస్తున్నారన్న కారణంతో ఓ కేటరింగ్ నిర్వాహకుడిని ఫెడేల్ మంటూ ఒక్కటిచ్చుకున్నాడు శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్. అంతేకాదండోయ్ ..తనకు తెలిసిన భాషనంతా ఉపయోగించి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఆ ఎమ్మెల్యే దూకుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


నిన్న మొన్నటి వరకు ఉద్దవ్ శిబిరంలో ఉన్న సంతోష్ బంగర్ .. ఆ తర్వాత పరిణామాల నేపధ్యంలో ఏక్ నాధ్ షిండే గూటికి చేరాడు. అప్పటి నుండి తనకు తిరుగే లేదనుకున్నాడో ఏమో.. ప్రతి విషయం పైనా రెచ్చి పోతున్నాడు. హిగోలి జిల్లాలో కార్మికులకు అందించే ఆహారం నాణ్యతగా లేదంటూ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై కన్ను పెట్టాడు. అక్కడికి వెళ్ళి వాస్తవాలను పరిశీలించాడు. అంతే కేటరింగ్ నిర్వాహకుడిని నిలదీశాడు. వార్నింగ్ ఇచ్చాడు. ఇంత వరకు ఓకే.. ఆ తర్వాతే పూనకం వచ్చినట్లు ఊగి పోయాడు. తిట్ల దండకాన్ని మొదలు పెట్టాడు. ఒక్కసారిగా కళ్ళెర్రజేసి చెంపలు ఫెడేల్ ఫెడేల్ మనిపించాడు. దీంతో ఆ కేటరింగ్ నిర్వాహకుడు పెద్దగా ఏడ్చేశాడు. లబోదిబో మన్నాడు.


కార్మిక శాఖలో తమ పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు మహారాష్ట్ర సర్కార్ ప్రతిరోజూ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. అయితే గత కొద్దికాలంగా ఆ భోజనం సరిగ్గా లేదంటూ అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులూ అందాయి. దీంతో ఏక్ నాధ్ షిడే వర్గానికి చెందిన శివసేన శాసనసభ్యుడు సంతోష్ బంగర్ ఆ కేంద్రానికి వెళ్ళి ఆహారాన్ని పరిశీలించాడు. అక్కడున్న మేనేజర్ ను పిలిచి నానా దుర్భాషలాడారు. కేటరింగ్ నిర్వాహకుడిని పిచ్చకొట్టుడు కొట్టారు. తిండి బాగుండాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ నిర్వాహకుడు బిత్తర పోయాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సంయమనం పాటించకుండా దూకుడుగా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేశారు అని నిలదీస్తున్నారు. అంతకుముందు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోని ప్రజా ప్రతినిధి ఇప్పుడు రెచ్చిపోయి ప్రవర్తించడం వెనుక కారణాలను వెతుకుతున్నారు.