InternationalNews

ప్రమాదపు అంచున ప్రపంచం..!

ప్రపంచం ప్రమాదపు అంచున నిలిచింది. అగ్రరాజ్యం.. చిన్న దేశం అని తేడా లేదు.. ప్రపంచ దేశాలన్నింటినీ ఆర్థిక మాంద్యం కబళిస్తోంది. సునామీలా విరుచుకు పడుతున్న ఆర్థిక మంద గమనంతో ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. మాంద్యం కాటు తప్పదని పలు దేశాల వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) హెచ్చరిస్తోంది. 2023 నాటికి ప్రపంచంలోని మూడో వంతు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతాయని చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది 3.2 శాతం ఉన్న వృద్ధి రేటు వచ్చే ఏడాది 2.7 శాతానికే పరిమితం కానుంది. కరోనా కాలాన్ని మినహాయిస్తే 2001 తర్వాత అతి తక్కువ వృద్ధి రేటు ఇదే. 2021లో 8.1 శాతం వృద్ధిరేటు సాధించిన చైనా ఈ ఏడాది 3.2 శాతం మాత్రమే అందుకోగలుగుతోంది. మరింత ఘోరంగా ఉన్న అమెరికా వృద్ధి రేటు ఈ ఏడాది 1.6 శాతం, వచ్చే ఏడాది ఒక శాతానికే పరిమితం కానుంది. ఇవన్నీ ఐఎంఎఫ్‌ వేసిన లెక్కలు.

వడ్డీ రేట్లు పెంచితే ఆర్థిక సంక్షోభం..

ఆర్థిక మందగమనం అంటే వృద్ధి రేటు నత్తనడకన సాగడం. ఆర్థిక మాంద్యం అంటే నెగెటివ్‌ వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. దాన్నుంచి బయట పడకముందే స్థిరాస్తి రంగ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆహార, ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయి. గరిష్ట స్థాయికి చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆయా దేశాల ఫెడరల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఫలితంగా ద్రవ్య సరఫరా తగ్గి భవన నిర్మాణ రంగం కుప్పకూలింది. అన్నీ కలిసి ప్రపంచ మార్కెట్‌ను ఆర్థిక మాంద్యం ముంగిట నిలిపాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా పెంచినప్పుడల్లా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయాన్ని ఐఎంఎఫ్‌ గుర్తు చేసింది.

దివాళా దిశగా క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌..

1970లోనూ అమెరికాలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం తలెత్తింది. ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో అప్పుడు ఆ దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తింది. ఇప్పుడు మరోసారి అలాంటి ముప్పే కనిపిస్తోంది. 2008లో లేమాన్‌ బ్రదర్స్‌ దివాళా తీయడంతో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. తర్వాత ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. తాజా సంక్షోభం క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌తో మొదలు కానుంది. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్‌ త్వరలో దివాళా ప్రకటించే ప్రమాదం ఉందంటున్నారు. ఆర్థికంగా బలమైన శక్తిగా ఉన్న స్విట్జర్లాండ్‌లోని బ్యాంకే దివాళా తీయడంతో ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

కోట్లాది ఉద్యోగాలు ఊడిపోతాయి..

ఆర్థిక మాంద్యం వస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ఊడిపోతాయి. నిరుద్యోగ రేటు వేగంగా పెరిగి ప్రజల ఆదాయం భారీగా పడిపోతుంది. ప్రజలు ఏమీ కొనలేరు.. తినలేరు.. దీంతో గిరాకీ తగ్గి ఉత్పత్తి కుంటుపడుతుంది. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు పోతాయి. ఇదంతా ఒక విషవలయంగా చుట్టుకుంటుంది. అగ్రదేశాలతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజల కొనుగోలు శక్తి ఇప్పటికే తగ్గిందని ఐఎంఎఫ్‌ చెబుతోంది. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలతాయి. మౌలిక, సేవా రంగాల్లో పెట్టుబడులు నిలిచిపోతాయి. చిన్న సంస్థలు మార్కెట్‌ నుంచి మాయమవుతాయి. కొత్త పెట్టుబడులు రావు. గిరాకీ తగ్గితే ముడి చమురు ధరలు పడిపోతాయి. కానీ.. ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించడంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మాంద్యంతో ఆర్థిక వ్యవస్థ మొత్తం తలకిందులవుతుంది.

ఇప్పటికే 70 దేశాలు ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మాంద్యంతో ఆయా దేశాలు దివాళా తీసే పరిస్థితి దాపురిస్తుంది. అప్పులిచ్చిన దేశాలు వాటిని రాబట్టుకొనేందుకు ఒత్తిడి పెంచుతాయి. అప్పు తీసుకున్న దేశాలు అటు అప్పు తీర్చలేక.. ఇటు తమ ప్రజల ఆకలి తీర్చలేక దివాళా ప్రకటిస్తాయి. అంటే.. రానున్న కాలంలో మరిన్ని శ్రీలంకలను మనం చూడాల్సి వస్తుందన్నమాట.