బీఆర్‌ఎస్ పెట్టిన నాడే తెలంగాణ బంధం తెగిపోయింది…
కర్ణాటక వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సదాశివ పేట వద్ద స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. జై ఈటల.. జై జై ఈటల.. జై బీజేపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆయనను అభిమానులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతానని వందల, వేల సార్లు కేసీఆర్ ప్రామిస్ చేశారని ఈటల గుర్తు చేశారు. దళిత ముఖ్యమంత్రి దేవుడు ఎరుగు, దళిత ఉప ముఖ్యమంత్రిని ఆ గౌరవంగా తీసివేసి అవమానపరిచారన్నారు. తెలంగాణ గడ్డమీద నాకున్న ప్రేమ, తెలంగాణ ప్రజలపట్ల నాకున్న కమిట్మెంట్ చంద్రబాబు నాయుడుకు, రాజశేఖర్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందా అని అడిగిన కేసీఆర్.. టిఆర్ఎస్ రద్దుచేసి బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ పెట్టిన నాటి నుండే కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం తెగిపోయిందని ఈటల పేర్కొన్నారు. కృష్ణ, గోదావరి జలాల మీద మాట్లాడుతానని.. పోలవరం ముంపు బాధితుల కోసం కొట్లాడుతానని చెప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర ప్రాంతానికి వెళ్తారని ఈటల ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రాంతానికి ఏ హామీలు ప్రకటిస్తారన్నారు. ఏ రోటికాడ పాట ఆ రోటి కాడ పాడే అవతారం కేసీఆర్ ఎత్తారు. కేసీఆర్ అధికారం మీద ఉన్న యావ, ధ్యాస ప్రజల మీద లేదు అనడానికి సజీవ సాక్ష్యం బీఆర్ఎస్ పార్టీ అని ఈటల స్పష్టం చేశారు.


