భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు..
వాతవరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వరుసగా వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల వడగండ్ల వానలు కూడా తోడయ్యాయి. అయితే ఈ అకాల వర్షాలతో రైతులు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల వేసవిలో వచ్చే మామిడి పండ్లు ప్రియం కానున్నాయి. మామిడి పండ్లు తినాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అయితే ఈ సారి మాత్రం సీజన్లో వచ్చే మామిడి పండ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అకాల వర్షాలు, తెగుళ్ళ దాడితో మామిడి పంటలను ప్రభావితం చేసింది. దీంతో మామిడి పండ్ల దిగుబడి తగ్గింది. ఈ వర్షాలతో మామిడి పంటతోపాటు మొక్కజొన్న, బొప్పాయి, ఉల్లి, పత్తి, టమోటా, మిరప వంటి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పొరుగు జిల్లాలు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే మొత్తం మామిడిలో, ఎక్కువ భాగం గల్ప్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. కానీ ఈ సీజన్లో అకాల వర్షాలు తోడవడంతో పంటలు నష్టపోవడం ఎగమతి మార్కెట్‌పై కూడా ప్రభావం చూపి సరఫరా తగ్గి ధరలు పెరగడానికి కూడా ఈ పరిస్థితి దారితీయవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మామిడి పండ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


