కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం ప్రభుత్వ సంకల్ప బలానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాలన్నారు. గతంలో పని చేసిన పోలీసు కమిషనర్లు హైదరాబాద్‌కు గొప్ప సేవలందించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.