ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగే..!
ప్రభుత్వ పెద్దలు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిజం కాదన్నారు ఆయన మిత్రుడు రామశివారెడ్డి. తన మిత్రుడితో మాట్లాడిన మాటలను ఇంటెలిజెన్స్ శాఖ రికార్డ్ చేస్తోందని కోటంరెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ రికార్డ్ చేయడంతో తనకు పార్టీపై నమ్మకం పోయిందన్నారు. అవమానం జరిగిన పార్టీలో ఉండలేనంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరితోనైతే మాట్లాడారో ఆ వ్యక్తే రామశివారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను ఐఫోన్ వాడటం లేదని.. ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే వాడుతున్నానని… తనకు వచ్చే కాల్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయన్నారు. కోటంరెడ్డితో మాట్లాడిన మాటలు యాధృచ్ఛికంగా మరో వ్యక్తితో షేర్ చేసుకున్నానని.. అవి బయకు వచ్చాయని చెప్పారు. ఇది ట్యాపింగ్ మాత్రం కాదని.. కేవలం రికార్డింగ్ మాత్రమేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ భక్తుడిగా.. జగన్ సర్కారుపై విమర్శలు చేయడం తట్టుకోలేక తాను మీడియా ముందుకు వచ్చానన్నారు రామశివారెడ్డి. తన ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధమన్నారాయన. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదాస్పదం అవుతుందని ఊహించలేదన్నారు. కాంట్రాక్టర్ల సమస్య గురించి కోటంరెడ్డితో మాట్లాడితే.. అది నిజమని చెప్పడం కోసం ఒక మిత్రుడికి షేర్ చేశానన్నారు.


