News Alert

జార్ఖండ్ అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ బలనిరూపణకు హేమంత్ సోరెన్ సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తనకు తాను గనుల కేటాయింపులు చేసుకోవడంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఇలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యారంటూ ఈసీ, గవర్నర్‌కు నివేదిక ఇచ్చినట్టు వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయ్. గవర్నర్ మొత్తం వ్యవహారంపై నిర్ణయం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ పక్షాలకు మెజార్టీ ఉండటంతో నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అదే సమయంలో సోరెన్ పై వేటు పడినా.. ఆయన తర్వాత జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండటంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలున్నారు. 2021 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ 25 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో గెలవగా… జార్ఖండ్ వికాస మోర్చా 3 స్థానాల్లోనూ, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వానికి 48 మంది సభ్యుల మద్దతు ఉంది.