Andhra PradeshHome Page Slider

అధికార పార్టీ ఎమ్మెల్యేలలో మొదలైన టెన్షన్

◆ ఈనెల 14న వైసీపీ చివరి వర్క్ షాప్
◆ వర్క్ షాప్ లో సీఎం జగన్ కీలక నిర్ణయాలు
◆ సిట్టింగ్ ల్లో ఎంతమందికి టికెట్లు ?
◆ గ్రాఫ్ పెంచుకోని శాసనసభ్యులపై వేటుకు సిద్ధం

ఏపీలో మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ప్రత్యేకంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన మూడున్నర సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తదితర అంశాలను వివరించాలని సూచించారు. తద్వారా ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండటంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజలు వివరించే అవకాశం ఉండటంతో ఆ సమస్యల పరిష్కారం కోసం వెంటనే ఎమ్మెల్యేలు స్పందించే అవకాశం ఉందని కాబట్టి ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసిన ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తూ వచ్చారు. దీంతో ఈనెల 14వ తేదీన చివరి వర్క్ షాప్ జరగనుంది.

ఈ సమావేశంలో గ్రాఫ్ పెరగని శాసనసభ్యులపై జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇదే అభిప్రాయం పార్టీ నేతల్లో కూడా ఉండటంతో గడపగడపకు సమావేశంపై ఎమ్మెల్యేలు టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి సమగ్ర నివేదిక జగన్ చేతికి అందింది. వాటి ఆధారంగానే ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు గడపగడప కార్యక్రమం పై నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించి ఆ సమావేశంలో అప్పటివరకు ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరు వెనక పడ్డారు అని నియోజకవర్గాల వారీగా జగన్ వివరించారు. దీంతో బుధవారం నాటి వర్క్ షాప్ లో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజల్లో సరైన గ్రాఫ్ లేని శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతారా ?… మరో అవకాశం వారికి ఇస్తారా అనేది రేపటి సమావేశంలో తేలనుంది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు లో కూడా ఈ వర్క్ షాప్ పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో జగన్ మొదటి నుండి ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ శాసనసభ్యులు నిరంతరం ప్రజల్లో ఉండేలా పక్కా ప్రణాళికలతో వివిధ కార్యక్రమాలు రూపొందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తూ ఆ నివేదికను పరిశీలిస్తూ ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం అయ్యాక ప్రతి ఎమ్మెల్యే పై ఫోకస్ పెట్టిన జగన్ గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ తీసుకుని ప్రజల్లో నిత్యం ఉండాలని సూచిస్తూ వస్తున్నారు. తాజాగా అన్ని దారుల ద్వారా నివేదికలు తెప్పించుకొన్న జగన్ రేపు జరిగే వర్క్ షాప్ లో ఆ నివేదిక ఆధారంగానే సమీక్ష చేయబోతున్నట్లు తెలుస్తోంది. చివరి వర్క్ షాప్ లో టికెట్లు దక్కని ఎమ్మెల్యేలను జగన్ ప్రకటిస్తారా ? ఎంతమంది జగన్ సూచించిన లక్ష్యాలను అందుకోలేకపోయారనేది ప్రస్తుతం ఉత్కంఠ గా మారింది. మరి జగన్ రేపు జరగబోయే వర్క్ షాప్ లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారో వేచి చూడాల్సి ఉంది.