మే మడతెట్టేస్తుందంట… ఎండలతో దబిడిదబిడేనంట!
టెంపరేచర్స్ పెరగడంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
పొగలు కక్కే ఎండతో విద్యుత్ సంక్షోభం
2022కి మించి రికార్డు స్థాయిలో వేడిగాలులు
ఆహారపదార్థాలపైనా పెను ప్రభావం
మే నెలలో దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. ఎండలు ముదరడంతో విద్యుత్ నెట్‌వర్క్ దెబ్బతింటుందని పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగుతుందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. తూర్పు-మధ్య, తూర్పు ప్రాంతాలలో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తేల్చింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాకరేపుతాయంది. 2022లో రికార్డు స్థాయిలో వేడిగాలులు మంటపుట్టించాయని, జనం బెంబేలెత్తిపోయారంది. అయితే ఇప్పుడు అంతకు మించి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.

ఎండ వేడమి పెరగడం వల్ల గోధుమ సరఫరాపైనా పెను ప్రభావం చూపొచ్చని తెలిపింది. ఇక వచ్చే నెల రోజుల పాటు కొత్తగా వ్యాపారం చేసేవారు వెనక్కి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే నిర్ణయాల విషయంలో వెనుకంజ వేయొచ్చంది. ఎండలు పెరిగే కొద్ది, విద్యుత్ సంక్షోభం, మ్యాన్ పవర్ కొరత తలెత్తొచ్చంది. మొత్తంగా రాబడిపై ప్రభావం చూపొచ్చంది. ఇక ప్రజలు ఎండ వేడిమి నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్‌లను ఆన్ చేయడం వల్ల వేడి తరంగాలు విద్యుత్ వినియోగాన్ని పెంచేస్తాయని వాతావరణ శాఖ వివరించింది. విద్యుత్ వినియోగం పెరగడం వల్ల, పవర్ గ్రిడ్‌పై మరింత ఒత్తిడిని పెరుగుతుందంది. ఇది కొన్నిసార్లు బ్లాక్‌అవుట్ కలగడానికి కారణమవుతుందంది.

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో లక్షలాది మంది బయటే పనిచేస్తుంటారు. చాలా మందికి తగిన రక్షణ కూడా ఉండదు. ఎండ దెబ్బతో కార్మికుల వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో పని కూడా అంతగా సాగదంది. ఉత్పాదకత తగ్గడంతోపాటు, కొన్నిసార్లు కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. వేడి తరంగాలను ప్రమాదకరంగా మార్చే ఏకైక అంశం ఎండ మాత్రమే కాదని.. చెమట పట్టడం ద్వారా ప్రజలు శరీరానికి సరిపడ నీటిని తీసుకోలేకపోవడం వల్ల ప్రాణాంతకం అవుతుందని అభిప్రాయపడింది.

ఈ సంవత్సరం ఉక్కిరిబిక్కిరి వేడిని ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియాతోపాటుగా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లలో ఉన్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కరువుతో జనం అల్లాడిపోతున్నారు. ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే… మే నెలలోనే వాయువ్య, పశ్చిమ మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం నుండి సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. ఎల్ నినో రాబోయే రుతుపవనాల కాలంలో అభివృద్ధి చెందుతుందని.. తద్వారా ఈ ఏడాది వర్షపాతం తక్కువ కావడానికి కారణమవుతోందంది. ఐతే హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులతో రుతుపవనాల సానుకూలంగానూ రావొచ్చంది.


