NewsTelangana

తెలంగాణ ఘన చరిత్ర… దేశానికి కీర్తి పతాక

Share with

చీకటి రుచి చూశాకే వెలుతురు విలువ తెలిసేది. చేదు రుచి చూశాకే తీపి విలువ తెలిసేది. ఏళ్ళకు ఏళ్ళు అంధకారంలో మగ్గిన రెండు తెలుగు రాష్ట్రాలు స్వాతంత్య్రానంతరం ఊపిరి పీల్చుకున్నాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీ లో భాగంగా ఉంటే.. తెలంగాణ నిజాం పరిపాలనో ఉండేది. ఈ రెండు రాష్ట్రాలు పడని కష్టాలు లేవు. చూడని బాధలు లేవు. కార్చని కన్నీళ్ళు లేవు. ఎన్నో సంవత్సరాలు పడ్డ వెతలకు 1948లో తెరపడింది. అప్పటి నుండి రెండు ప్రాంతాలు అభివృద్ది బాట పట్టాయి. కాలగమనంలో వచ్చిన మార్పులు .. అనేక ఉధృత పోరాటల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడింది. స్వయం సమృద్ది సాధించి పురోగమి పథంలో దూసుకు పోతోంది. 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతంలో తెలంగాణ గణనీయమైన పురోభివృద్ది సాధించి .. గర్వంగా తలెత్తుకుంటోంది.

ఆధిపత్యం కోసం తిరుగుబాట్లు.. పాలన కోసం సిగపట్లు.. సాయుధ పోరాటాలు.. రజాకార్ల అరాచకాలు.. జమిందారుల వేధింపులు ఇలా ఒకటేమిటి ఎన్నో బాధలతో తెలంగాణ కొట్టుమిట్టాడింది. ఊళ్ళకు ఊళ్ళు కన్నీళ్ళతో కుమిలిపోయాయి. పేట్రేగిన అరాచకాలతో అల్లాడి పోయాయి. ఎవరికీ చెప్పుకోలేక.. చెప్పలేక మౌన రోదనను అనుభవించాయి. తిరగబడ్డ ప్రతి వారిని విచక్షణా రహితంగా అణగదొక్కారు. అప్పటి వరకు ఎంత మంది పాలించినా .. నిజాం హయాం జరిగినన్ని అకృత్యాలు ఎవరి పాలనలోనూ అంతగా జరగలేదు. 1947 నాటికి దేశంలో ఉన్న దాదాపు 500 సంస్ధానాలు ఇండియన్ యూనియన్లో కలిసి పోతే .. హైదరాబాద్ ను కలిపేందుకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేక మెలికలు పెట్టాడు. కానీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం, లౌక్యం ఫలించడంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయాడు.

1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యింది. అంటే దేశానికి స్వాతంత్ర్యం లభించిన కొన్ని నెలల తర్వాత హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛావాయులు పీల్చుకుంది. ఆ తర్వాత ఆరున్నర దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉండి పోయింది. ఆసమయంలో తలెత్తిన ఉద్యమాలు అన్నీ ఇన్నీ కావు. స్వాతంత్ర్య కాలంలో ఎదురైన పరిస్ధితులు కంటే ఎన్నో తీవ్రమైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. ముల్కీ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెలంగాణను ఒక ఊపు ఊపేశాయి. కొంతకాలం స్ధబ్దుగా కనిపించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఊపందుకోవడంతో తప్పని సరి పరిస్ధితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పలేదు. ఈ మహోద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. జైళ్ళకెళ్ళారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అవన్నీ ప్రత్యేక రాష్ట్ర సాధనతో ఆ.. గాయాలన్నీ కొద్దికొద్దిగా మానుతూ వచ్చాయి.

స్వాతంత్య్రానంతరం 75 ఏళ్ళ కాలంలో తెలంగాణ అన్ని అంశాలలో చెప్పుకోతగ్గ రీతిలో పురోగతి సాధించింది. అన్ని రాష్ట్రాల కంటే వేగంగా ముందుకు దూసుకు పోతోంది. పార్టీలను, రాజకీయాలను పక్కన పెడితే.. తెలంగాణ ఇప్పుడు గణనీయమైన పురోగామి పథంలో పయనిస్తోంది. పట్టణ, గ్రామీణాభివృద్దిలో ఎంతో పురోభివృద్ధి సాధించింది. అలాగే వాణిజ్యపరంగా కూడా దూసుకు పోతోంది. విద్యాపరంగా తెలంగాణలో ఎంతో వెనుకబాటుతనం ఉండేదన్న భావన ఇప్పుడు కనిపించడం లేదు. విరివిగా విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో పాటు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున విద్యా సంస్ధలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు అందుబాటులోలేని అన్ని కోర్సులు ఇప్పుడు ముంగిట ముందుకే వచ్చినట్లయ్యింది. కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిధులు మంజురు చేస్తుండడంతో అన్ని రంగాలో రాష్ట్రం ఉనికిని చాటుకుంటోంది. వైద్యరంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. అన్ని ఆసుపత్రులు ఆధునీకరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను విస్తృతపరిచారు.

అయితే ఉద్యోగాల కల్పనలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. పాలకులు ఆర్భాటంగా చేసిన వాగ్దానాలు కూడా అమలుకు నోచకోక పోవడం కూడా కొంత అసంతృప్తకి కారణాలు మారుతున్నాయి. ఇక నీటి పారుదల రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. చెరువులు సస్యశ్యామలమయ్యాయి. రిజర్వాయర్ల సంఖ్య పెరిగింది. సాగు భూములు పెరిగాయి. అలాగే దిగుబడులు కూడా పెరిగాయి. కానీ .. సరైన గిట్టుబాటు ధరలు లేవనే బాధ మాత్రం రైతాంగాన్ని వేధిస్తోంది. గతంలో ఉన్న ఉస్మానియా కెమికల్స్, ఆజాంజాహీ మిల్స్, నిజాం షుగర్స్, ప్రాగా టూల్స్ వంటి అనేక పరిశ్రమలు మూతపడ్డా .. ఇప్పుడు ఐటీరంగంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. దేశంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ కు కేంద్రంగా మారింది. ఎన్నో సంస్ధలు ఇక్కడ తమ కార్యాలయాను ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ వస్తున్నాయి.

అయితే ప్రభుత్వరంగ సంస్ధల్లో మాత్రం ఉద్యోగావకాశాలు గగనంగా మారాయి. ప్రైవేట్ సెక్టార్ లో మాత్రం పెద్ద ఎత్తున అనేక కంపెనీల ఏర్పాటుకు అనుమతులు లభిస్తున్నాయి. విదేశీ సంస్ధలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో హైదరాబాద్ లో ఎన్నో కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. గృహ నిర్మాణతో పాటు ఇతర రంగాల్లో కూడా ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత పురోభివృద్ధి చూస్తున్నాం. ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా .. ఏ కంపెనీలు రావాలన్నా అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు, చొరవ ఎంతో అవసరం. చిత్తశుద్ధి, కార్యదక్షత, చేయాలన్న తలంపు .. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న భావన బలంగా ఉంటే.. దేశంలో అయినా.. రాష్ట్రాలోనైనా అభివృద్ధి దానంతట అదే పరుగులు తీస్తుంది.