VRAల నెలరోజులుగా నిరవధిక సమ్మె-KCR సర్కార్‌కి షాక్
ఓపక్క తెలంగాణా ప్రభుత్వానికి తొలగించిన VROల నుండి ప్రతిఘటన ఎదురవుతుంటే మరోవైపు వారి స్థానంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తూ, కంప్యూటర్ ఆపరేటింగ్, రికార్డుల నిర్వహణ, నోటీసుల జారీ, పహాణీ పత్రాల పరిశీలన మొదలైన అన్ని బాద్యతలు నిర్వహిస్తున్న VRAల నుండి కూడా చుక్కెదురైంది. కేవలం 10,500 రూపాయల గౌరవవేతనం మాత్రమే ఇస్తూ వారితో అనేకరకాల పనులు చేయించుకునే ప్రభుత్వాన్ని నిరసిస్తూ, 2020 చట్టసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 వేలమంది వీఆర్‌ఏలు గత నెల 25 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు.

రెండేళ్ల క్రిందట VROలను భూవ్యవహారాల నుండి తప్పించిన ప్రభుత్వం ఈ పనులన్నీ VRA లతోనే చేయిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా రెండు దఫాలుగా ప్రవేశ పరీక్షను నిర్వహించిన ప్రభుత్వం 3 వేలమందిని VRAలుగా నియమించింది. వీరిలో దాదాపు 20శాతం మహిళలు కూడా ఉన్నారు. వేతనం తక్కువైనా పదోన్నతి ద్వారా పైస్థాయికి చేరుకోవచ్చని ఆశించి, పీజీలు చేసినవారు కూడా ఉన్నారు. 2020 VROల రద్దుతో వారి పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. ప్రభుత్వం తమను సర్దుబాటు చేస్తుందేమో అని ఎదురుచూస్తూ ఆవేదన చెందుతున్నారు. పైగా కరోనా కాలంలో ఏడుగురు వీఆర్‌ఏలు మరణించగా వారికి ఏరకమైన సహాయం లేదు. VRAలు సమ్మెలో ఉండడంతో పలు సేవలు స్తంభించాయి. భూములకొలతలు, సర్వే నిర్వహణకు సహకారం అందించే సిబ్బంది లేక దాదాపు 8వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి 10 వేల దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. జిల్లాకలెక్టర్ల ఆదేశాలను గ్రామాలకు చేరవేసే నాధుడు కూడా లేడు. RIలే స్వయంగా వెళ్లాల్సి వస్తోంది. తమకు సరైన PAYSCALE మరియు క్రమబద్దీకరణ చేయాలనే డిమాండులతో వీరు సమ్మె చేస్తున్నారు.