బీజేపీ మెప్పు కోసం తహతహలాడుతున్న టీడీపీ, వైసీపీ !
◆ అడక్కుండానే ఎన్ డి ఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు ?
◆ వైసీపీ కేసులు భయంతోనే బిజెపికి మద్దతు ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ
◆ బిజెపితో అంతరాన్ని తగ్గించుకోవడానికి టిడిపి తహతహ
◆ సామాజిక న్యాయం కోసం మద్దతు తెలిపామన్న ఇరు పార్టీలు
ఈనెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలైన వైసీపీ, టిడిపి దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రాపకం కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రధాన ప్రతిపక్షం టిడిపి బిజెపి పెద్దల మెప్పు కోసమే అడగకుండానే తమ మద్దతు తెలిపాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటులో అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు. అందుకే టీడీపీ మద్దతు కావాలని ఏ పక్షమూ కూడా అడగలేదని తెలుస్తోంది. పైగా టిడిపి అధినేత హడావుడిగా ద్రౌపతి ముర్ము కు మద్దతు ప్రకటించి ఎక్కడా లేని తాపత్రయాన్ని ప్రదర్శించారు.
రాజకీయ సమీకరణాలు మారిపోవటంతో బిజెపి కూటమి కేంద్రంలో అధికారంలో ఉండటంతో వైసిపి కూడా ద్రౌపది అభ్యర్థిత్వానికి జై కొట్టింది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్డీఏ ప్రకటించగానే ఆ పార్టీ నేత ఆమెకు శాలువాలు కప్పి సామాజిక మాధ్యమాల్లో వెంటనే పోస్ట్ చేశారు. అధికారికంగా ప్రకటించగానే గిరిజన అభ్యర్థి కాబట్టి మద్దతు ఇస్తున్నట్లు వైసిపి ప్రకటించింది. ఆమె నామినేషన్ కార్యక్రమంలో కూడా ఆ పార్టీ ఉభయసభల నేతలు కూడా పాల్గొన్నారు. కేసుల భయంతోనే వైసిపి నేతలు అంత హడావుడిగా ఆమె అభ్యర్థిత్వానికి జై కొట్టారని పలువురు విశ్లేషిస్తున్నారు. కానీ వైయస్సార్సీపి మద్దతు బిజెపి అడిగిందా లేదా ఎవరికి తెలియదు కానీ బిజెపి నేతలు సత్య కుమార్ తాము మద్దతు అడగలేదని ఒకసారి ప్రకటించగా, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాత్రం తామాడిగితేనే వైసిపి మద్దతు ఇచ్చిందని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికి వైసీపీ, టిడిపి మాత్రం కాషాయ పార్టీకి దాసోహం అన్నట్లు వ్యవహరించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ రెండు పార్టీలు మాత్రం సామాజిక న్యాయం పాటిస్తున్నామని అందుకోసమే ఆమే అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినట్లు ప్రకటించడం విశేషం.