స్వీడిష్ శాస్త్రవేత్తకు వైద్య రంగంలో నోబెల్
నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. 2022లో విశేష ఆవిష్కరణలు చేసిన వివిధ రంగాల ప్రముఖులకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ జ్యూరీ పురస్కారాలు ప్రకటిస్తోంది. స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబోకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్‌మాన్ సోమవారం తెలిపారు. ఆయన మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించి ఆవిష్కరణలు చేశారని చెప్పారు. పాబో మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆంథ్రపాలజీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

జన్యు క్రమం ఆవిష్కరణ..
రాతియుగం నాటి నియాండర్తల్ మానవుడు ఇప్పటి ఆధునిక మానవుడికి బంధువు వంటివాడు. దీంతో నియాండర్తల్ మానవుడి జన్యుక్రమాన్ని స్వాంటే పాబో ఆవిష్కరించారు. ఇప్పటి వరకూ వెలుగులోకి రాని డెనిసోవా మానవుడి గుట్టును కూడా ఆవిష్కరించారు. 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలస ప్రారంభమైన తర్వాత హెమినిన్స్ మానవుల జన్యువులు ప్రస్తుత ఆధునిక హోమోసేపియన్స్‌కు ఎలా బదిలీ అయ్యాయో పరిశోధనాత్మకంగా వివరించారు. ప్రస్తుత మానవుల వ్యాధి నిరోధక వ్యవస్థ అనేక ఇన్ఫెక్షన్లకు స్పందించే తీరుకు, జన్యు బదిలీకి మధ్య గల సంబంధాన్ని కూడా విపులంగా చెప్పారు.

అన్ని రంగాల్లోనూ నోబెల్..
భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని మంగళవారం(అక్టోబరు 4న), రసాయన శాస్త్ర విజేతను బుధవారం (అక్టోబరు 5న), సాహిత్య నెబెల్ బహుమతిని గురువారం (అక్టోబరు 6న), శాంతి నోబెల్ బహుమతి విజేతను శుక్రవారం (అక్టోబరు 7న), ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేతను సోమవారం (అక్టోబరు 10న) ప్రకటిస్తారు. డిసెంబరు 10వ తేదీన ఈ నోబెల్ బహుమతితో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోన్లు (9,00,357 అమెరికన్ డాలర్లు).. మన కరెన్సీలో రూ.7.2 కోట్లు అందజేస్తారు.

