NationalNews

అధిక లాభాలను ఆర్జించే మట్టిలేని COCOPONICS సేద్యం

Share with

మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ముందు ఆహారం సరిగ్గా తీసుకోవాలని న్యూట్రిషియన్స్ చెబుతూ ఉంటారు. సగటు మానవుడు రోజుకు 400 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అయితే దీనిలో సగం కూడా సామాన్య ప్రజలకు అందని పరిస్ధితి.

పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న రోజుల్లో మంచి సారవంతమైన భూమిలో పండే కూరగాయలు, ఆకుకూరలు ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం అంటే ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. జనాభా పెరుగుతున్నకొద్దీ నాణ్యమైన కూరగాయలు కరువైపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారమార్గాన్ని సూచిస్తోంది. COCOPONICS (SOILLESS CULTIVATION) . ఈ పద్దతిలో కొబ్బరిపొట్టు ఎరువు, పోషక ద్రావణంతో గ్రో బాగ్స్ లో పంటలు పండించవచ్చు. వాణిజ్య పద్దతిలో ఆకుకూరలు, ఔషదమొక్కలను పెంచవచ్చు. ఇందుకు సంబంధించి బెంగళూరులోని IIHR సంస్ధ శిక్షణ ఇస్తోంది. ఈ పద్ధతిని అనుసరించి తక్కువగా ఉన్న తేలిక భూములు, చౌడు భూములు, ఎడారి నేలల్లో  సేద్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి ఈ పద్దతి ప్రధాన పాత్ర వహిస్తుందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంచనా వేస్తోంది.

నగర జీవితాలకు తగినట్టుగా తక్కువ స్థలంలో, తక్కువ నీటితో, ఆరోగ్యప్రదంగా ఆకుకూరలను, కూరగాయలను పెంచుకోవచ్చు. ఈ సాగుకు మట్టి అవసరం లేదు. సిల్ఫాలిన్ బ్యాగుల్లో శుద్ది చేసిన కొబ్బరిపొట్టుని నింపి ఎరువును, 12 రకాల సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన మందులను డ్రిప్ ద్వారా అందించడమే దీని ప్రత్యేకత. వాణిజ్య స్థాయిలో మంచి ఆరోగ్యకరమైన మొక్కలను పెంచడానికి ARKA FERMENTED COCOPIT, ARKA SASYA POSHAK RAS ను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చారు.  

వీటిని నేలమీద , మేడమీద, పాలీహౌస్‌, గ్రోబాగ్స్‌లలో ఎక్కడయినా పెంచవచ్చు. IIHR వారు ఆకుకూరలు, టమాటా, క్యాబేజి, బీన్స్, గుమ్మడికాయలు వంటి అనేక రకాల కూరలు మట్టి రహిత పద్దతిలో పెంచి సత్పలితాలు సాధించారు. పోషక లోపం లేకుండా ప్రజల రోజువారీ అవసరాలు తీరేలా కూరగాయలు పండించవచ్చు.

ఈ కొబ్బరిపొట్టును ఒకసారి వేసుకుంటే చాలు, పంట పూర్తయ్యాక అందులోనే మళ్లీ ఎరువు వేసి, పోషక ద్రావకం వేసి మళ్లీ పంట కూడా వేసుకోవచ్చు. దీనిలో కలిపే పోషకాలు చాలా శుద్దమైనవి. పూర్తిగా నీటిలో కరిగి మొక్కల వేర్లకు వెంటనే అందుతాయి. అంతేకాక భూములు, నీరు రసాయనాల కారణంగా పాడయ్యే ప్రమాదం కూడా ఉండదు. మట్టి కూడా లేకపోవడం వల్ల కూరలు కూడా బాగా తాజాగా ఉంటాయి. అపార్టమెంట్లలోనూ, గేటెడ్ కమ్యూనిటీలలోనూ కూడా వీటి పెంపకం చాలా సులువుగా ఉంటుంది. ఒక్కరోజు శిక్షణ ద్వారా ఎలాంటి అవగాహన లేని వారు కూడా చాలా సులభంగా నేర్చకోవచ్చు. దీనిని ఉపాధిగా కూడా మలుచుకోవచ్చు. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థకు చెందిన డాక్టర్ డి. కలైవనన్ శిక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్దతిలో కూరగాయల వ్యవసాయం చేస్తే ఒక రూపాయి పెట్టుబడికి దాదాపు 3 రూపాయల నుండి, 12 రూపాయల వరకూ సంపాదించవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రాబడికి రాబడి. బాగుంది కదూ. మీరూ.. ఆలోచించండి !