రాజీనామాను వెనక్కి తీసుకున్న శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంక్షోభాన్ని నివారించేందుకు రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నానన్నారు శరద్ పవార్. సుదీర్ఘ కాలంగా రాజకీయాలు చేస్తోన్న శరద్ పవార్, ఇటీవల జరిగిన కొన్ని పరిణామలతో పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ చీఫ్‌గా కొనసాగుతానని శరద్ పవార్ ప్రకటించారు. మహారాష్ట్రలోని క్యాడర్ భావోద్వేగ నిరసనల నేపథ్యంలో ఆయన తాజా నిర్ణయం తీసుకున్నారు.

1999లో తాను స్థాపించిన పార్టీ అధినేతగా కొనసాగడం గురించి ఆలోచించేందుకు తనకు సమయం కావాలని చెప్పిన పవార్, తాజాగా నిర్ణయాన్ని వెల్లడించారు. “అన్నింటిపై పునరాలోచన తర్వాత, నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను” అని శరద్ పవార్ ఈ సాయంత్రం చెప్పారు.

ఆయన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీకి చేరవవుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ విసిరిన రాజీనామా అస్త్రం పార్టీని ఏకతాటిపైకి వచ్చేలా చేసింది. సోనియా గాంధీతో విభేదించి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సంచలనం రేపిన పవార్, దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర.

