Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

రేవంత్‌ పాలన హిట్లర్‌ శైలిలో సాగుతోంది

హైదరాబాద్‌: బోరబండలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “రంజాన్‌ తోఫా, బతుకమ్మ చీర, క్రిస్మస్‌ గిఫ్ట్‌ లాంటి పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేసింది. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆ పథకాలను తిరిగి అమలు చేస్తాం,” అని ఆయన హామీ ఇచ్చారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ, “హైదరాబాద్‌ను బర్బాద్ చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్కూటీలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు—ఏదీ అమలుకాలేదు,” అని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి పాలనలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం, పేదల ఇళ్లను కూల్చడం, మహిళలను మోసం చేయడం జరిగిందని ఆరోపించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు రాకుండా చూడాలంటే సునీతమ్మను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే, “అర్ధరాత్రి ఫోన్ చేసినా అరగంటలో వస్తాం. బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుంది,” అని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

రేవంత్‌ రెడ్డి కుర్చీ కోసం రూ.100 కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోయినా ‘లూటిఫికేషన్లు’ మాత్రం కొనసాగిస్తున్నదని ఎద్దేవా చేశారు.

“రేవంత్‌ రెడ్డి హిట్లర్‌లా ప్రవర్తిస్తున్నారు. డబ్బు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి,” అని ప్రజలను కోరారు.