గుండా రాజకీయాలు చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి
సీఎం స్థాయి మరిచి చిల్లర, గల్లి, గుండా రాజకీయాలు చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శలు చేశారు. కేసీఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకుంటారని వామపక్ష నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు ఈటల. తుంట కింద వేసి మొద్దు ఎత్తుకునే ప్రయత్నం చేయకండని హితవు పలికారు. ప్రజాక్షేత్రంలో సీఎం గెలిచేంత వరకు మాత్రమే ఈ డ్రామాలు ఉంటాయని.. అప్పుడు అసలు స్వరూపం బయటపడుతుందన్నారు. అప్పుడు మాలాంటి వాళ్లే మీకు దిక్కు అవుతారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులను అష్ట కష్టాలు పెడుతుందని ఈటల ఆరోపించారు. సర్పంచి పోస్టు సుంకరోల్ల కంటే అద్వాన్నంగా అయిపోయిందన్నారు. దిక్కులేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. బిల్లులు రాక, నిధులు లేక గ్రామపంచాయితీ సిబ్బందికి జీతాలు రావడంలేదన్నారు. పేరుకు మాత్రమే ధనిక రాష్ట్రం, గొప్ప పరిపాలన, దేశానికి ఆదర్శం తెలంగాణ అని చెప్తారు. ఊరు పేరు ఏమో కస్తూరివారు ఇంట్లోనేమో గబ్బిలాల వాసన అన్నట్టు కేసీఆర్ పని తీరు ఉందన్నారు ఈటల.

మరో వైపు రాష్ట్రంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. పండించిన పంటకు అమ్ముదామంటే కొనుగోలు లేవన్నారు ఈటల. వరి కుప్పలన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి. 20-30 రోజులు రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. త్వరలో ఐకెపి సెంటర్లు తెరవాలని, కటింగ్ లేకుండా రైతులును ఇబ్బంది పెట్టకుండా సకాలంలో పంటను దించుకోవాలన్నారు. వెంటనే డబుబలు వేయాలని ఈటల ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

