Home Page SliderTelangana

నిజామాబాద్ రూరల్ బీజేపీ దూసుకొస్తోందా?

ఉమ్మడి జిల్లాలో కమ్మ సామాజికవర్గం ప్రాధాన్యత అత్యధికంగా ఉన్న నియోజకవర్గం నిజామాబాద్ రూరల్. గతంలో ఈ నియోజకవర్గం నుంచి డిచ్‌పల్లిగా ఉన్నప్పుడు మాండవ వెంకటేశ్వరరావు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన నాలుగుసార్లు డిచ్ పల్లి నుంచి ఒకసారి నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి గోవర్దన్ రెండు సార్లు విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో భూపతి రెడ్డిని ఓడించిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు ఆయనపై గెలుపు కోసం శ్రమించాల్సి వస్తోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ సైతం బలంగా ఉంది. ఇక్కడ్నుంచి దినేష్ కుమార్ కులాచారి గట్టి ఫైట్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ్నుంచి జెండా ఎగురేయాలన్న లక్ష్యంతో బీజేపీ చాన్నాళ్ల క్రితమే ఇక్కడ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకొంది. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ముక్కోణపు పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 293 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 1,16,052 స్త్రీ ఓటర్లు 1,32,212 ట్రాన్స్‌జెండర్లు 5 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,48,269 ఉన్నారు. స్త్రీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కీలక నియోజకవర్గం ఇది. ఇక్కడ మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్ల పెద్ద సంఖ్యలో ఉన్నాయ్. సుమారుగా 12 శాతం వరకు వారున్నారు. మాదిగలు 10 శాతం వరకు ఉండగా, లంబాడలు తొమ్మిదన్నర శాతం వరకు ఉన్నారు. ముదిరాజ్‌లు 9 శాతం, రెడ్లు, పద్మశాలీలు ఏడున్నర శాతం చొప్పున ఉన్నారు. మాలలు 7 శాతం, ముస్లింలు 6 శాతం, యాదవులు 5 శాతం, గౌడలు, రజకులు 4 శాతం చొప్పున ఉన్నారు. ఇతరులు 20 శాతం వరకు ఉన్న… ఇక్కడ బీసీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ విశ్వాసంగా ఉంది.