NationalNews

ఆలయ నిబంధనలు అతిక్రమించిన నితీష్ .. హిందూ సంఘాల ఆగ్రహం

బీజేపీతో కలిసున్నంతకాలం ఒకరకం.. ఆర్జేడీతో కలిశాక మరోరకం. నితీష్ వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. పెద్ద దుమారాన్ని రేపుతోంది. అధికారం చేతిలో ఉంది. అతి పెద్ద బలం, బలగం ఉంది. ఇంకేం కావాలి అనుకున్నాడో ఏమో. నియమ నిబంధనలను.. ఆలయ మర్యాదలను, కట్టుబాట్లను అన్ని మరిచి .. ఓ హిందూయేతర మంత్రితో కలిసి గయలోని విష్ణుపద్ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించడం తీవ్ర వివాదం రేగింది. అంతేకాదు ఆ హిందూయేతర మంత్రితో కలిసి స్వయంగా పూజలు నిర్వహించడం కూడా విమర్శలు పెల్లుబుకుతున్నాయి.


బీహార్ లోని గయలో ఉన్న విష్ణుపద్ ఆలయం అత్యంత పురాతనమైనది. ఫలగూ నదీ తీరంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయంగా విష్ణుపద్ ఆలయానికి పేరుంది. ఇక్కడ శ్రీమహా విష్ణువు పాద ముద్రలు ఉంటాయని ప్రతీతి. గయాసురుని ఛాతి భాగంపై ఆ వైకుంఠనాధుడు పాదము ఉంచిన ప్రదేశం కాబట్టే ఈ క్షేత్రానికి విష్ణుపద్ అని పేరొచ్చింది. అత్యంత పురాణ ప్రాశస్ధ్యం కలిగిన ఈ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ కట్టుబాట్లు, నియనిబంధనలను స్వయంగా ముఖ్యమంత్రి ఉల్లంఘిచారని బీజేపీతో పాటు పలు హిందుత్వ సంఘాలు మండి పడుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు బీహార్ లో పెద్ద రాజకీయ చిచ్చు రేపింది. గయ ప్రాంతానికి అధికారిక పర్యటన కోసం వచ్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, హిందుయేతరుడైన తన సహచర మంత్రితో కలిసి ఆలయ దర్శనానికి వచ్చారు. అలాగే గర్భగుడిలోకి ప్రవేశించి సహచర మంత్రితో కలిసి అభిషేకాలు నిర్వహించారు. ఇదే ఇప్పుడు వివాదం అయ్యింది.


హిందూయేతరులకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయం బయట ఉన్న నోటీస్ బోర్డు గురించి కూడా తెలిపినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆలయ అధికారులు విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కమలనాధులు మండి పడుతున్నారు. హిందువుల మనోభావాలను గాయపరచడంతో పాటు .. ఆలయ మర్యాదలను కాలరాచారని నితీష్ పై బీజేపీ నిప్పులు కక్కుతోంది. హిందుత్వం, హిందూ ధర్మం.. సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై నమ్మకం లేకపోతే మిన్నకుండాలి గానీ.. ఇలా నిబంధనలను సీఎంయే అతిక్రమించడం బాధాకరం అంటూ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతకు ఉద్దేశపూర్వకంగా ఆయన భంగం చేశారని కమలనాధులు దుయ్యబడుతున్నారు.


నితీష్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన హిందుస్థాని అవామి మోర్చా మాత్రం ముఖ్యమంత్రి నితీష్ చర్యను వెనకేసుకొచ్చింది. బీజేపీ నేతల ఆరోపణలను కొట్టి పారేసింది. సమాజంలో ప్రతి అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు అగ్గిలా మండుతోంది. నిరసనలకు దారితీస్తోంది. ఆందోళనల బాట పట్టిస్తోంది. ఇంత జరుగుతున్నా దీనిపై ముఖ్యమంత్రి గానీ.. ఆయన సహచర మంత్రి గానీ స్పందించకపోవడం చూస్తే వారి నిర్లక్ష్యం అవగతమవుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. రెండు రోజుల క్రితం పాట్నాలో నితీష్ కాన్వాయ్ పై కొందరు దాడులు తెగబడి నానా విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. పాపం.. నితీష్. గూడు మారగానే .. నిబంధనలు మారవు. శిబిరం మార్చగానే చట్టం మారదు. మనుషులు మారగానే .. పద్ధతులు మారవు. పదవి కోసం ఎంతటి ఘన కార్యానికైనా ఒడిగట్టే నితీష్ ఇప్పుడు సహచర మంత్రికి చెందిన సామాజిక వర్గం మెప్పు కోసం నిబంధనలు అతిక్రమించి ఇబ్బందుల్లో పడ్డాడు. చూద్దాం. బీజేపీ ఈ వ్యవహారాన్ని ఏ మలుపు తిప్పబోతోందో.