NationalNews

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. పలువురి అరెస్టు

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల నుంచే నిజామాబాద్‌, హైదరాబాద్‌, కర్నూలు, కడప, గంటూరు నగరాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా తీశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో నిజామాబాద్‌ జిల్లాలోనే 28 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. 22 మందిని అరెస్టు చేశారు. ఛారిటీ పేరుతో నిధులు వసూలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న సమాచారంతో సయ్యద్‌ షాహిద్‌కు ఎన్‌ఐఏ నోటీసులు ఇచ్చింది. గత నెల 28వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. ఈ నెల19వ తేదీన విచారణ కోసం హైదరాబాద్‌ రావాలని ఆదేశించింది.

అబ్దుల్‌ ఖాదిర్‌ నిజామాబాద్‌లో 200 మందికి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరికి కేరళ, ఢిల్లీ, కర్ణాటకకు చెందిన పీఎఫ్‌ఐ నేతలతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. నిర్మల్‌ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో కూడా సోదాలు చేపట్టిన అధికారులు అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. జగిత్యాలలో మూడు ఇళ్లలో, టవర్‌ సర్కిల్‌లోని కేర్‌ మెడికల్‌, టీఆర్‌ నగర్‌లోని ఒక ఇంట్లో ఎన్‌ఐఏ బృందాలకు డైరీలు, ఇతర పత్రాలు లభించాయి. నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం ఖాజానగర్‌లో ఇలియాజ్‌, ఆయన స్నేహితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు.