Andhra PradeshNews

పేరు మార్పు సరికాదు.. యార్లగడ్డ రాజీనామా

ఎన్టీయార్‌ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌ యూనివర్సిటీగా మార్చిన సీఎం జగన్‌పై సొంత మనుషులే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పేరు మార్పు సరికాదని పలువురు జగన్‌కు సూచించారు. హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడం తనకు బాధాగా ఉందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. పేరు మార్పు తనను మనస్థాపానికి గురి చేసిందంటూ తన పదవికి రాజీనామా చేశారు.

వ్యతిరేకించిన వంశీ, నాని..

టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పెద్ద మనసుతో నందమూరి తారక రామారావు పేరుతో జిల్లాను ఏర్పాటు చేసిన జగన్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణ జన్ముడైన మహానీయుడి పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని ఏపీ సీఎంను కోరారు. ఈ వర్సిటీని ఏర్పాటు చేసే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్య విశ్వవిద్యాలయాలు లేవని, ఎన్టీయార్‌ పేరును కొనసాగించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని.. జగన్‌కు సూచించారు.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలపడమే: బీజేపీ

ఎన్టీయార్‌ పేరు మార్చడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలపడమేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ఎన్టీయార్‌ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. పేరు మార్పుతో జగన్‌కు కలిగే లాభమేమిటో అర్ధం కావడం లేదన్నారు.