ములాయం మృతి, దేశ వ్యాప్తంగా నేతల నివాళులు
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా నేతలు నివాళలు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలవోని ప్రముఖులందరూ ములాయం మృతి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా గౌరవనీయమైన తండ్రి మరియు అందరి నాయకుడు ఇక లేరంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా దేశ ప్రజలకు తెలిపారు.
ములాయం సింగ్ యాదవ్ మరణం దేశానికి తీరని లోటని… మారు మూల ప్రాంతం నుంచి వచ్చిన ములాయం సింగ్ యాదవ్ సాధించిన విజయాలు అసాధారణమైనవన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ‘ధర్తి పుత్ర’ ములాయం భూమితో అనుబంధం ఉన్న అనుభవజ్ఞుడైన నాయకుడన్నారు. దేశంలోని అన్ని పార్టీల ప్రజలు ఆయనను గౌరవించారన్నారు.
ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు ములాయం సింగ్ యాదవ్‌తో నేను చాలా సంభాషించేవాడనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇద్దరి మధ్య స్నేహం కొనసాగిందన్నారు. ఎల్లప్పుడూ ములాయం అభిప్రాయాలను వినడానికి ఎదురు చూసేవాడినన్నారు. ములాయం మరణం బాధిస్తోందన్న ప్రధాని.. కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు సానుభూతి తెలిపారు.
ములాయం సింగ్ యాదవ్ యూపీతోపాటు, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు ప్రధాని. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం సైనికుడిలా పనిచేశారన్నారు. రక్షణ మంత్రిగా, బలమైన భారతదేశం కోసం పనిచేశారని… జాతీ ప్రయోజనాల కోసం పనిచేశారన్నారు మోదీ.
ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఉత్తరప్రదేశ్, జాతీయ రాజకీయాల్లో భారీ శూన్యత ఏర్పడిందన్నారు కేంద్రం హోం మంత్రి అమిత్ షా. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో నేతాజీకి నివాళులర్పించారు.
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణ వార్త చాలా విచారకరమన్నారు యూపీ మాజీ సీఎం మాయవతి.
ములాయం సింగ్ యాదవ్ మరణవార్త తెలిసి కలత చెందానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రియమైన సోదరుడిని కోల్పోయానన్నారు. 4 దశాబ్దాలుగా భారత రాజకీయాలపై లోతైన అవగాహనతో, ఓబీసీ ప్రముఖుడితో ఎక్కువ సమయం గడిపే అదృష్టం లభించిందన్నారు. ఒక అరుదైన పెద్దమనిషని మర్యాదపూర్వకంగా ఉండేవారని… సోషలిస్ట్ లక్ష్యాలను సాధించడం కోసం లక్షలాది మంది జీవితాలను మార్చారన్నారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ రాజకీయాల్లోకి వచ్చారని… దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి మూడుసార్లు సీఎంగా, కేంద్రమంత్రిగా జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేశారన్నారు.