దేశంలో మోదీ ప్రభంజనం … ఇండియా టీవీ సర్వేలో వెల్లడి
దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభంజనం వీస్తోందని ఇండియా టీవీ వెల్లడించింది. ఇండియా టీవీ మాట్రిజ్ నిర్వహించిన సర్వేలో కీలకాంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ పక్షాలకు 362 స్థానాలు, యూపీఏ పక్షాలకు 97 స్థానాలు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. ‘దేశ్ కి అవాజ్’ పేరుతో విడుదల చేసిన సర్వేలో మూడ్ ఆఫ్ ద నేషన్ ను ఆ సంస్థ లెక్కగట్టింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో 84 సీట్లు వస్తాయంది. ఈనెల 11 నుంచి 24 మధ్య నిర్వహించిన సర్వేలో ఎన్డీఏకు 41 శాతం ఓట్లు, యూపీఏకు 28 శాతం ఓట్లు, ఇతరులకు 31 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది.
దేశంలో మళ్లీ ప్రధానిగా మోదీయే ఉండాలని 48 శాతం మంది కోరుకుంటున్నారని సర్వే పేర్కొంది. మోదీ తర్వాతి స్థానాల్లో రాహుల్ గాంధీ 11 శాతం, మమతా బెనర్జీ 8 శాతం, సోనియా గాంధీ 7 శాతం, మాయావతి 6 శాతం, శరద్ పవార్ 6 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 5 శాతం, నితీష్ కుమార్ 4 శాతం, కె చంద్రశేఖర్ రావు 3 శాతం ఉన్నారు. ప్రియాంక వాద్రా 2 శాతంతో ఉన్నారు. మోదీ సర్కారు ముచ్చటగా హ్యాట్రిక్ కొడతారని సర్వే తేల్చిచెప్పింది. మోదీకి బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న ప్రశ్నకు 23 శాతం మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌ను ఎంచుకున్నారు. 11 శాతం మంది మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపగా, 8 శాతం మంది నితీష్ కుమార్, సోనియా గాంధీల వైపు మొగ్గు చూపారు. ఇండియా టీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ‘దేశ్ కి ఆవాజ్’ జూలై 11 నుండి 24 వరకు, భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 136 లో 34,000 శాంపిల్స్ సేకరించి సర్వే వెల్లడించింది. వీరిలో 19,830 మంది పురుషులు మరియు 14,170 మంది మహిళలు ఉన్నారు.