ఏపీలో కొనసాగుతున్న పట్టభద్రులు,ఉపాధ్యాయులు,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక
• 13 వ తేదీ సోమవారం ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకూ పోలింగ్
• 16 వ తేదీ గురువారం ఉదయం 8.00 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం
• 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది, 2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు పోటీ
• ఐదు స్థానిక సంస్థల నియోజక వర్గాలకు వైఎస్సార్సిపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎంపిక
• ఎన్నికలు జరిగే ఎనిమిది నియోజక వర్గాల్లో పరిశీలకులుగా సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారులు
•రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు ,మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాలకు సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారులను ఎన్నికల పరిశీలకులుగా కూడా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు మరియు మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాలు కలుపుకుని మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు మూడు పట్టభద్రుల నియోజక వర్గ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గ స్థానాలకు మరియు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలు స్థానిక సంస్థల నియోజక వర్గ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతపూరం, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు స్థానిక సంస్థల నియోజక వర్గ స్థానాలకు వైఎస్సార్సిపి అభ్యర్థులు మినహా ఇంకా ఏఒక్కరూ ఈ స్థానాలకు పోటీ చేయకపోవడం వల్ల వైఎస్సార్సిపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎంపికైన్లటు ప్రకటించారు. అనంతపూరం స్థానిక సంస్థల నియోజక వర్గానికి ఎస్.మంగమ్మ, కడప స్థానిక సంస్థల నియోజకవర్గాని కి రామ సుబ్బారెడ్డి పొన్నపురెడ్డి, నెల్లూరు నియోజక వర్గానికి మెరిగ మురళీధర్, తూర్పు గోదావరి నియోజక వర్గానికి కుడిపూడి సూర్యనారాయణ రావు మరియు చిత్తూరు స్థానిక సంస్థల నియోజక వర్గానికి సుబ్రహ్మణ్యం సిపాయి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది, 2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 10,00,519 పట్టభద్రులైన ఓటర్లు, రెండు ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల్లో 55,842 మంది ఓటర్లు మరియు మూడు స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో 3,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికకు 1,172 పోలింగ్ స్టేషన్లను, 2 ఉపాధ్యాయ స్థానాల ఎన్నికకు 351 పోలింగ్ స్టేషన్లను, 3 స్థానిక సంస్థల స్థానాల ఎన్నికలకు 15 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించడం జరిగింది. వీటిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెలుపల కూడా వీడియోగ్రఫీని చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

